calender_icon.png 22 November, 2025 | 2:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ జిల్లాకు రెండు కమిటీలు

22-11-2025 02:03:38 PM

కరీంనగర్ రూరల్, అర్బన్ డీసీసీల ఏర్పాటుకు కసరత్తు

రూరల్ కు మేడిపల్లి సత్యం, అర్బన్ కు వెలిచాల

కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలో అర్బన్, రూరల్ విభజించి పార్టీ అధ్యక్షులను, కమిటీలను ఏర్పాటు చేసే ఆలోచనలో పీసీసీ కసరత్తు చేస్తుంది. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో ఏఐసీసీ నుండి నియామక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. వరంగల్ అర్బన్ జిల్లా తరహాలో కరీంనగర్ అర్బన్ కమిటీని ఏర్పాటు చేయాలని చూస్తుంది. కరీంనగర్ నగరపాలక సంస్థ విస్తీర్ణం పెరగడంతోపాటు భవిష్యత్ లో కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాలు కూడా విలీనమై గ్రేటర్ కరీంనగర్ గా ఏర్పడే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ పార్టీ రెండు కమిటీలను వేయాలని ఆలోచిస్తున్నది. కరీంనగర్ రూరల్ జిల్లాకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను, అర్బన్ కు కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావును నియమించే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నారు.

కరీంనగర్ అర్బన్ పరిధిలోకి కరీంనగర్ కార్పొరేషన్, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాలు, రామడుగు, తిమ్మాపూర్ మండలాలను కలపడంతోపాటు చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలను కలిపే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. రూరల్ కిందికి చొప్పదండితోపాటు హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి, సైదాపూర్ మండలాలను కలిపి రూరల్ కమిటీగా ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం మేడిపల్లి సత్యం, వెలిచాల రాజేందర్ రావుల పేర్లను పరిశీలించిన అధిష్టానం స్థానిక సంస్థల ఎన్నికల్లో కరీంనగర్ అర్బన్ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఈ విధమైన విభజన చేయనున్నట్లు తెలిసింది. భవిష్యత్తో కరీంనగర్ అర్బన్, రూరల్ నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉన్నందున వరంగల్ అర్బన్ తరహాలో కరీంనగర్ అర్బన్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఈ కమిటీల ప్రకటన ఒకటి రెండు రోజుల్లో జరగనుంది. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యం కనుక చివరి క్షణంలో మార్పులు, చేర్పులు ఉన్నా ఆశ్చర్యం లేదు.