22-11-2025 01:51:05 PM
ప్రభుత్వ పథకాల్లో మహిళలకు ప్రాధాన్యత.
అర్హులైన ప్రతి మహిళకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తాం
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
ఇల్లంతకుంట, (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇల్లంతకుంట మండలం ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి పథకంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఉపాధి దొరుకుతుందని, మహిళల ఆత్మ గౌరవానికి తోడ్పడుతుందని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ఇల్లంతకుంట రైతు వేదికలో మహిళా ఉన్నతి.. తెలంగాణ ప్రగతి కింద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని వివరించారు. ప్రతి ప్రభుత్వ పథకం అమలులో మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎస్ హెచ్ జీ ల నుంచి రుణాలు మంజూరు చేస్తుందని వెల్లడించారు. మహిళల ఆర్థిక ప్రగతికి కోట్లాది రూపాయల లోన్లు ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. జిల్లాలోని సిరిసిల్లలో ఇందిరా మహిళాశక్తి చీరలు తయారై రాష్ట్ర మంతా పంపిణీ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. 32 జిల్లాల నుంచి ఎస్ హెచ్ జీ ల బాధ్యులు వచ్చి చీరల తయారీ విధానం, దశలు, రంగులు, నాణ్యత చూసి ఆనందం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పన, మరమ్మత్తుల పనులు అమ్మ ఆదర్శ పాఠశాల కింద మహిళా సంఘాలకు అందించామని తెలిపారు.
ఎస్ హెచ్ జీ ల్లో ప్రస్తుతం 18- 59 ఏండ్ల వారికి అవకాశం ఉందని, ప్రభుత్వం ఇప్పుడు 15-18 ఏండ్ల కిశోర బాలికలకు, 60 ఏండ్ల వయసు పైబడిన వారికి కూడా సంఘాలు ఏర్పాటు చేసే అవకాశం కల్పించిందని తెలిపారు. సంఘాల్లోని మహిళలకు రుణ బీమా, ప్రమాద బీమా అమలు చేస్తుందని, రూ. రెండు లక్షల వరకు రుణ బీమా, రూ. 10 లక్షల చొప్పున ప్రమాద బీమా మంజూరు చేసిందని వెల్లడించారు. జిల్లాలో కొత్తగా 5560 మంది ఎస్ హెచ్ జీల్లో చేరారని తెలిపారు. అంగన్వాడీ, ఆశా కార్యకర్తలతోపాటు ఇప్పుడు ఎస్ హెచ్ జీ సభ్యులకు యూనిఫాం చీరలు పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే, ఇంచార్జి కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చైతన్య, వైస్ ఛైర్మన్ ప్రసాద్, డీఆర్డీఓ శేషాద్రి, మండల ప్రత్యేక అధికారి, డీసీఓ రామకృష్ణ, తహసీల్దార్ ఫరూక్, ఎంపీడీఓ శశికళ, ఏపీఎం, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.