29-01-2026 04:14:19 PM
హైదరాబాద్: మేడారం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నయాపైసా సాయం చేయలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy ) స్పష్టం చేశారు. మేడారంలో మంత్రి సీతక్కతో కలిసి పొంగులేటి ప్రెస్ మీట్ నిర్వహించారు. మేడారం అభివృద్ధికి రూ. 3.26 కోట్లు ఇచ్చినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారని పొంగులేటి తెలిపారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాటలు చెప్పడం తప్ప.. చేసిందేమీ లేదని ఆరోపించారు. మేడారాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు.
సమ్మక్క–సారక్క జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రుల పర్యటనతో ఈ అంశం త్వరలోనే సాకారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమ్మక్క–సారక్క జాతరను గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా, మరో కుంభమేళాగా మంత్రి పొంగులేటి అభివర్ణించారు. ఈ మహాజాతర విజయవంతంగా నిర్వహించేందుకు అంకితభావంతో కృషి చేస్తున్న అధికారులు, సిబ్బంది, సహకరిస్తున్న మీడియా మిత్రులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.