18-12-2025 10:25:11 AM
సిద్ధిపేట: హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పర్యటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి బైక్ నడుపుతూ మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అంబేద్కర్ భవన్, అక్కడ జరుగుతున్న సీసీ రోడ్లు డ్రైనేజీ పనులను పర్యవేక్షించి మంత్రి పొన్నం ఇప్పటికే పట్టణంలో శంకుస్థాపన చేసుకున్న రోడ్లు, డ్రైనేజీ లు, కమ్యూనిటీ హాల్ లు, జంక్షన్ ల అభివృద్ధి పనులను పరిశీలించారు.
అభివృద్ధి పనులపై మున్సిపల్ కమిషనర్,ఇతర అధికారులకు పలు సూచనలు చేసి పెండింగ్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇంకా పట్టణంలో ఎక్కడెక్కడ రోడ్లు, డ్రైనేజీ పనులు అవసరమున్నాయో ఆరా తీశారు. స్థానిక ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్న పొన్నం ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అభివృద్ధి పనులు, జంక్షన్ ల సుందరీకరణ పనులపై ఆరా తీశారు. హుస్నాబాద్ మున్సిపాలిటీని రాష్ట్రంలో ఆదర్శంగా ఉండేలా, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకార్ తెలియజేశారు.