calender_icon.png 18 December, 2025 | 4:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో ప్రశాంతంగా కొనసాగిన ఎన్నికల ప్రక్రియ

18-12-2025 08:41:40 AM

- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,(విజయక్రాంతి): రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మూడవ విడత ఎన్నికల ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. బుధవారం జిల్లాలోని జైపూర్ మండలం ఇందారం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ, మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపు, భీమారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి మధుసూదన్ లతో కలిసి పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా జరిగేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరిగిందని, మూడవ విడత ఎన్నికలలో భాగంగా జిల్లాలోని చెన్నూర్, మందమర్రి, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాలో గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరిగిందన్నారు. 102 గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానాలకు 390 నామినేషన్లు వచ్చాయని, 4 స్థానాలు ఏకగ్రీవం కాగా 98 స్థానాలకు, 868 వార్డు సభ్యుల స్థానాలకు గాను 1,905 నామినేషన్లు వచ్చాయని, 4 స్థానాలలో నామినేషన్లు రాకపోవడం, సరైన నామినేషన్లు సమర్పించకపోవడం మినహాయించి, 153 స్థానాలు ఏకగ్రీవం కాగా 711 స్థానాలకు ఎన్నికలు నిర్వహించామన్నారు.

ఈ ఎన్నికలలో 1 లక్ష 6 వేల 889 మంది ఓటర్లు ఉండగా 87.78 శాతంతో 93 వేల 822 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం జరిగిందని, వాయిదా పడ్డ ఉప సర్పంచులకు ఈ నెల 18 న ఎన్నికలు ఉంటాయన్నారు. ఈ నెల 18వ తేదీన ఉదయం 10 గంటల వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని, ఎన్నికలలో గెలుపొందిన వారు విజయోత్సవ వేడుకలు నిర్వహించకూడదని తెలిపారు. గ్రామపంచాయతీ నూతన కార్యవర్గం సమన్వయంతో గ్రామీణ స్థాయి అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మూడవ విడత ఎన్నికల ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకులు, ఫ్లయింగ్ స్క్వాడ్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, పోలింగ్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో సమర్ధవంతంగా విధులు నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.