దేశంలో అదానీ, ప్రధాని మాత్రమే ఉండాలని చూస్తుంది బీజేపీ
హైదరాబాద్,(విజయక్రాంతి): భారత్ లో వ్యాపారవేత్త అదానీ, ప్రధాని మోదీ, భారతీయ జనత పార్టీ మాత్రమే ఉండాలని బీజేపీ చూస్తోందని మంత్రి సీతక్క ఆరోపించారు. గురువారం పార్లమెంట్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యాలపై తెలంగాణ మంత్రి సీతక్క స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... దేశంలోని ప్రతి పౌరుడి సమానత్వం కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారని పేర్కొన్నారు. మను ధర్శశాస్త్రంను బీజేపీ పాటిస్తూ.. కుల, మత, ధనిక అంతరాలను సూచించే మను ధర్మశాస్త్రాన్ని బీజేపీ అనుసరిస్తుందని మండిపడ్డారు. అంబేద్కర్ పేరు తలచడాన్ని అమిత్ షా తప్పుపట్టడమంటే అంబేద్కర్ ను అవమానించడమే అని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అట్టడుగు వర్గాలకు అంబేద్కర్ దేవుడని, దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని తొలగించాలనే బీజేపీ కుట్ర బయటపడిందన్నారు. జవహర్ నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో డా.బీఆర్ అంబేద్కర్ ఔనత్యాన్ని చాటిచెప్పినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ గాంధీ కుటుంబ పార్టీ అంటున్న మోడీ, మరీ మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా, మూడు సార్లు దేశ ప్రధానమంత్రిగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. దేశంలో రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ పేరు లేకుండా చేసేందుకే బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. భవిష్యత్ లో ఓకే ఎన్నిక ,ఓకే పార్టీ, ఓకే వ్యక్తి అనే కుట్రకు భాతరతీయ జనతా పార్టీ తెరలేపిందని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు.






