calender_icon.png 12 May, 2025 | 9:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుష్కర పనుల్లో నాణ్యత పాటించాలి: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

11-05-2025 05:28:20 PM

మహదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని దక్షిణ కాశిగా పేరుపొందిన ప్రముఖ త్రిలింగ క్షేత్రమైన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో 15వ తేదీ నుండి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతి పుష్కరాల పనులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాళేశ్వరంలో విఐపి ఘాట్, సరస్వతి మాతా విగ్రహం,  జ్ఞానతీర్థం,  నదిలో భక్తుల స్నానమాచరించు ప్రదేశం, టెంట్ సిటీని పరిశీలించారు. అనతరం టెంట్ సిటీలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి రాక సందర్భంగా బందోబస్తు, పనులు పూర్తి చేయు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ... పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయని, మీరే జవాబు చెప్పాలన్నారు. కాళేశ్వరం పట్టణం మొత్తాన్ని విద్యుద్దీకరణతో ముస్తాబు చేసి 12 రోజులు పండుగ వాతావరణం చేయాలని సూచించారు.  సరస్వతి మాత విగ్రహాన్ని పూలతో అందంగా అలంకరణ చేయాలని ఆదేశించారు.  పిండ ప్రధాన  భవనం అసంపూర్తిగా ఉందని దేవాదాయ ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు హారతి కార్యక్రమాన్ని వీక్షించేందుకు  పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.  భక్తులు నదిలోకి స్నానాలకు వెళ్ళడానికి  తాత్కాలిక రహదారి ఏర్పాటుతో పాటు క్వియర్ మాట్  ఏర్పాటు చేయాలని తెలిపారు. భక్తులు నదిలోకి వెళ్లకుండా  వెళ్లకుండా బారికేడ్స్, ప్రమాద హెచ్చరికల బోర్డ్స్ ఏర్పాటు చేయాలన్నారు.

నదిలో 50 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచడంతో పాటు నాటుపడవలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.  పుష్కరాలు సందర్భంగా  మొట్టమొదటిసారిగా కాళేశ్వరంలో టెంట్ సిటి  ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.ఈకార్యక్రమాలు సజావుగా, సక్రమంగా పకడ్బందీగా జరిగేందుకు  మినిట్ టు మినిట్  కార్యక్రమం తయారు చేయాలని సూచించారు.  హారతి కార్యక్రమం పర్యవేక్షణకు దేవాదాశాఖ నుండి ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభోత్సవానికి వస్తున్నారని అలాగే తదుపరి రోజుల్లో గవర్నర్, రాష్ట్ర మంత్రులు   వచ్చే ఆవకాశం ఉన్నందున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు.  మహదేవ పూర్  నుండి వీధిదీపాలు ఏర్పాటుతో పాటు డివైడర్లు మధ్యలో స్ట్రిప్ లైట్లు  ఏర్పాటు చేయాలని స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ కు సూచించారు.  రహదారులకు మరమ్మత్తులు నిర్వహించాలని ఎక్కడ గుంతలు ఉండొద్దని ఆర్ అండ్ బి, జాతీయ రహదారుల అధికారులను ఆదేశించారు.

తాత్కాలిక బస్టాండ్ వద్ద తాత్కాలిక లైటింగ్, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.  పారిశుద్ధ్యం చాలా  ముఖ్యమని పట్టణం మొత్తం పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు.  మరుగుదొడ్లు పరిశుభ్రత పాటించేందుకు ప్రతి 30 నిమిషాలకు పరిశుభ్రం చేసే విధంగా పర్యవేక్షకులను నియమించాలని ఆయన ఆదేశించారు.  పనులు పర్యవేక్షణకు నియమించిన నోడల్ అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పనులలో నాణ్యత పాటించాలని నాణ్యత పాటించకపోతే చర్యలు తప్పవని మంత్రి కాంట్రాక్టర్లు ను హెచ్చరించారు. ప్రత్యేక అధికారులు స్థానికంగా ఉండి పనులు పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఒక్క నిమిషం కూడా కరెంటు పోవద్దని కాటారం,  బీరసాగర్ నుండి విద్యుత్ సరఫరా తీసుకోవాలని అన్నారు. విద్యుత్ అంతరాయం ఏర్పడితే తదుపరి చర్యలకు ఆరు జనరేటర్  125 కేవీ జనరేటర్లు అందుబాటులో ఉంచుకోవాలని, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. 

దేవాలయం, 100  గదుల సత్రంలో జనరేటర్లు ఏర్పాటు చేయాలని దేవాదాయశాఖ అధికారులను ఆదేశించారు. భక్తులకు ప్రతి రోజు అన్నదానం చేయాలని మంత్రి స్పష్టం చేశారు. భక్తులు నదిలోకి వెళ్ళు సందర్భంలో ఇసుకలో ఎండకు కాళ్లు కాలకుండా మ్యాట్స్ ఏర్పాటు చేయాలన్నారు.  రంగులు వేసేందుకు ప్రత్యేకంగా జె ఎన్ టి యు నుంచి సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  పట్టణం మొత్తం విద్యుత్తు దీపాలతో సుందరీకరణ చేయాలని, పండుగ వాతావరణం ఉండాలని పేర్కొన్నారు.  మెయిన్ ఘాట్ వద్ద ఆర్చి స్లాబు వేసినట్లు దేవాదాయ ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కరాలు దగ్గర పడుతున్న  సమయంలో ఎందుకు స్లాబు వేశారని, పని ఎలా అయిపోతుంది చెప్పండి అంటూ దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులను ప్రశ్నించారు. 

స్లాబ్ చేయకుండా ఉండాల్సిందని భక్తులు నదిలోకి ఎలా వెళ్తారని అసంతృప్తి వ్యక్తం చేశారు.  రవాణా సౌకర్యం కల్పనకు క్యాబ్స్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.  ట్రాఫిక్ ప్లాన్ ప్రక్కగా తయారు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ వెంకటరావు,  జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,  ఎస్పీ కిరణ్ ఖరే, దేవాదాయ శాఖ ఆర్జెసి రామకృష్ణారావు,  అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్,  విజయలక్ష్మి, అదనపు ఎస్పీ బోనాల కిషన్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక సింగ్, మహాదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూఎస్,  వైద్య,  ఆర్ అండ్ బి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.