12-05-2025 02:33:30 AM
న్యూఢిల్లీ, మే 11: భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందంపై తొలుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలా ప్రకటన చేస్తారని లోక్‌సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రధాని మోదీని ప్రశ్నించారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణపై ట్రంప్ ప్రకటన తదితర అంశాలపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రాహుల్ కోరారు.
ఈమేరకు ఆదివారం రాహుల్‌గాంధీతో పాటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. పీవోకేను పాకిస్థాన్ ఖాళీ చేయాలని కోరుతూ..1994లో లోక్‌సభ, రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదించబడిన తీర్మానం గురించి వారు పునరుద్ఘాటించారు. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గురించి అమెరికా అధ్యక్షుడు తొలి ప్రకటన చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది.
మన దేశ సమస్య అయిన కశ్మీర్‌ను అంతర్జాతీయ సమస్యగా చేయడాన్ని వ్యతిరేకించింది. ‘మోదీజీ..మీరు ప్రత్యేక పార్లమెంట్ సెషన్ నిర్వహించండి. ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణ అంశాలన్నీ చర్చిద్దాం. ఈ విషయాలపై ప్రజలకు చెప్పాల్సిన అవసరముంది. ప్రజాప్రతినిధులుగా ప్రజలకు ఆ విషయాల గురించి చెప్పడం అత్యంత కీలకంగా భావిస్తున్నాను.
మన ముందున్న సవాళ్లను సమిష్టిగా ఎదుర్కొవడానికి ఇదొక సువర్ణావకాశం అవుతుంది. కాల్పుల విరమణ నిర్ణయం తీసుకోవడానికి భారత్‌కు పాక్ నుంచి ఏమి ప్రయోజనం వచ్చింది..? మా డిమాండ్‌పై త్వరగా పరిశీలిస్తారని విశ్వసిస్తున్నాను’ అని రాహుల్‌గాంధీ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.