12-05-2025 02:11:33 AM
పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదు
మన దాడులతో పాకిస్థాన్ వణికిపోయింది
రెచ్చిపోతే అంతుచూస్తామని.. ఇకపై కవ్విస్త్తే తాట తీస్తామంటూ త్రివిధ దళాధిప తులు హెచ్చరించారు. భారత బలమేంటో పాక్‌కు తెలిసొచ్చిందన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేస్తే నామరూపాలు లేకూండా చేస్తామని గట్టిగా హెచ్చరించారు. పీవోకే, ఉగ్రవాదుల అప్పగింతపై తప్ప వేరే విషయంపై పాక్‌తో చర్చలు అనవసరం అని ప్రధా ని పేర్కొన్నట్టు భారత ప్రభుత్వవర్గాలు తెలిపాయి.
పాక్ బుల్లెట్లు వేస్తే.. మిస్సైల్స్ తో సమాధానం చెప్పండని ప్రధాని స్పష్టంచేసినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఆపరేషన్ సిందూర్‌తో మన బలాన్ని ప్రపంచానికి చాటామని, ఉగ్రస్థావరాలపై దాడి చేసి పహల్గాం బాధితులకు న్యాయం చేశామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ వెల్లడించారు.
న్యూఢిల్లీ, మే 11: భారత దాడులకు తట్టుకోలేక కాల్పుల విరమణ అని ప్రాధేయపడిన పాకిస్థాన్.. భారత శాంతిని తక్కువగా అంచనా వేస్తూ పలు ఉల్లంఘనలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో భారత త్రివిధ దళాలకు చెందిన అధికారు లు పాక్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. పాక్ దాడులకు దిగితే గట్టి సమాధానం ఇస్తామని హెచ్చరించారు.
పాకిస్థాన్ బుల్లెట్లు వేస్తే.. మిస్సైల్స్ ప్రయోగించాలని ప్రధాని మోదీ తెలిపినట్టు భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఆపరేషన్ సిందూర్‌పై ఆదివారం భారత త్రివిధ దళాలకు చెందిన అధికారులు మీడియా సమావేశం ఏర్పా టు చేసి ఇప్పటి వరకు జరిగిన అంశాలు, దొంగదెబ్బ తీసేందుకు పాకిస్థాన్ చేసిన కుటిల యత్నాలను తిప్పికొట్టిన తీరును వివరించారు.
డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, వాయుసేన తరఫున డైరెక్టర్ జనరల్ ఎయిర్ ఆపరేషన్స్ (డీజీ ఎయిర్ ఆపరేషన్స్) ఎయిర్ మార్షల్ అవధేశ్ కుమార్ భారతి, నేవీ తరఫున డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేవల్ ఆపరేషన్స్ (డీజీ ఎన్‌వో) వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్, మేజర్ జనరల్ ఎస్‌ఎన్ శారద పాల్గొన్నారు.
ఆపరేషన్ సిందూర్ మొదలైన నుంచి పాక్ చేసిన కుటిల యత్నాలను వివరించారు. శనివారం కాల్పుల విరమణ ఒప్పందం జరిగినాగానీ పాక్ తన బుద్ధి మార్చుకోలేదని, ఒప్పందం జరిగిన కొద్ది గంటల్లోనే పలు ప్రాంతాల్లో దాడులు చేసిందన్నారు. పాక్ నక్క వినయం ప్రదర్శిస్తూ జరిపిన కాల్పుల్లో భారత్‌కు చెందిన ఐదుగురు జవాన్లు అమరులయ్యారని అధికారు లు పేర్కొన్నారు.
భారత్ చేసిన దాడుల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులు మరణించినట్టు పేర్కొన్నారు. భారత దాడుల్లో మర ణించిన ఉగ్రవాదుల్లో అబూ జుందల్, హఫీ జ్ మహ్మద్ జమీల్, మౌలానా మసూద్ అజహర్ బావమరిది, మహ్మద్ యూసుఫ్ అజహర్, అబ్బూ అకాషా, మహ్మద్ హసన్ ఖాన్ తదితరులు ఉన్నారు. పాకిస్థాన్ ఇకపై దాడులకు దిగితే.. భారత్ ఏం చేయగలదో వారికి అర్థమై ఉంటుందని తెలిపారు.
పాకిస్థాన్ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసినట్టు ఆధారాలతో సహా వివరించారు. భారత ప్రధాని మోదీ పలువురు ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహించారు. పీవోకే, ఉగ్రవాదుల అప్పగింతపై మాత్రమే పాక్‌తో చర్చలు ఉంటాయని భారత ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. పాక్ దాడులు చేస్తే.. సహించేది లేదని భారత ప్రధాని మోదీ అమెరికా ఉపాధ్యక్షుడికి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో బ్రహ్మోస్ ఉత్పత్తి కేంద్రాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్.. పాక్ సైనిక ప్రధాన కేంద్రమున్న రావల్పిండిలోనూ భారత సైన్యం గర్జించిందని తెలిపా రు. భారత్ పాక్‌లోని పౌరులపై దాడులు చేయకున్నా పాక్ మాత్రం భారత పౌరులే లక్ష్యంగా దాడులు చేసినట్టు పేర్కొన్నారు. సోమవారం భారత్ డీజీఎంవోల మధ్య మధ్యాహ్నం చర్చలు జరగనున్నాయి.
40 మంది పాక్ సైనికులు హతం
మూడు రోజుల పాటు జరిగిన దాడుల్లో 35-40 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారని డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ‘పహల్గాం ఉగ్రదాడి అనంతరం 9 ఉగ్రవాద స్థావరాలను గుర్తించి.. వాటిని ధ్వంసం చేసేందుకు ‘ఆపరేషన్ సిందూర్’ నిర్వహించాం. కొన్ని పీవోకేలో ఉండగా.. మరికొన్ని పాకిస్థాన్‌లో ఉన్నాయి. మొత్తం 9 స్థావరాలపై దాడులు చేశాం.
అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లే వంటి నరహంతకులకు శిక్షణనిచ్చిన స్థావరాలను నేలమట్టం చేశాం. ఐసీ 814 హైజాక్ నిందితులు, పుల్వామా దాడికి సంబంధించిన నిందితులు కూడా ఈ దాడుల్లో మరణించారు. ఒక వేళ పాకిస్థాన్ దాడి చేస్తే.. తిప్పి కొట్టేందుకు పూర్తి సన్నద్ధతతో ఉన్నాం. మిలటరీ స్థావరాలను నాశనం చేసేందుకు పాకిస్థాన్ డ్రోన్లతో ఎన్నో విఫలయత్నాలు చేసింది.
వాటిని మన బలగాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. మూడు డ్రోన్లు భూమిని తాకినా అవి తక్కువే నష్టం కలిగించాయి. మే 8 తేదీల్లో పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్లు, విమానాలు మన గగనతలంలోకి ప్రవేశించాయి. సరిహద్దుల్లో ఉన్న మిలటరీ స్థావరాలపై పాకిస్థాన్ అనేక దాడులు చేసి విఫలం అయింది.
మే 10న పాక్ డీజీఎంవో ఫోన్ చేశారు. ఆ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. శనివారం సాయం త్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ పా టించాలని నిర్ణయించినా.. పాకిస్థాన్ ఉల్లంఘించింది. క్షేత్రస్థాయి అధికారులకు సర్వసైన్యాధ్యక్షుడు పూర్తి స్వేచ్ఛనిచ్చారు.’ అని పేర్కొన్నారు.
పాక్ రాడార్ స్టేషన్లపై దాడులు
పాకిస్థాన్‌కు చెందిన పలు రాడార్ స్టేషన్లు, సైనిక స్థావరాలపై దాడులు చేసినట్టు ఎయిర్ మార్షల్ ఎ.కె భారతి పేర్కొన్నారు. ‘పాకిస్థాన్ డ్రోన్లతో పాటు మానవరహిత వైమానిక వాహనాలను పంపింది. అన్నింటికీ దీటుగా బదులిచ్చాం. శ్రీనగర్ నుంచి నలియా (కచ్ గుజరాత్) వరకు పాక్ డ్రోన్లతో దాడులు చేసింది.
లా హోర్, గుజ్న్‌వ్రాలాలోని రాడార్ కేంద్రాలను ధ్వంసం చేశాం. లాహోర్‌కు దగ్గరగా ఉన్న ప్రాంతం నుంచే డ్రోన్ దాడులకు తెగబడ్డారు. పాకిస్థాన్ భూభాగంలో ఉన్న ముర్కిదే, బహవల్‌పూర్ క్యాంపులను కూడా ధ్వంసం చేశాం. కచ్చితంగా లక్ష్యాలను గుర్తించిన తర్వాత గగన తలం నుంచి భూతలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించాం.
పాకిస్థానీ డ్రోన్లు, మానవ రహిత విమానాల వల్ల భారత్‌లోని వైమానిక స్థావరాలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదు. సుక్కర్‌లోని ఎయిర్‌క్రాఫ్ట్ షెల్టర్‌ను ధ్వంసం చేశాం. పాకిస్థాన్‌లో కీలకమైన చకాలా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దా డులు జరిపాం. వైమానిక దాడుల సందర్భంగా పాకిస్థాన్ పౌరవిమానాలను లక్ష్య ంగా ఉపయోగించుకుంది. పాకిస్థాన్‌లో ఉన్న ప్రతి వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే సత్తా మాకుంది.’ అని పేర్కొన్నారు.
నౌకాదళం సిద్ధంగా ఉంది
నేవీకి చెందిన క్యారియర్ బ్యాటిల్ గ్రూప్, సబ్‌మెరైన్లు సిద్ధంగా ఉన్నట్టు వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ వెల్లడించారు. ‘అరేబియా సముద్రంలో భారత నేవీ సిద్ధంగా ఉంది. పాకిస్థాన్ దాడులు చేస్తే భారత్ ఏం చేయగలదో ఇప్పుడు వారికి అర్థమై ఉంటుంది. పాకిస్థాన్ కవ్విస్తున్నా నేవీ సంయమనంతో వ్యవహరించింది. ఎటువంటి చర్యలకైనా నౌకాదళం సిద్ధంగా ఉంది. ఏ క్షణంలోనైనా కరాచీపై దాడికి సిద్ధంగా ఉన్నాం. పాకిస్థాన్‌లో ఉన్న స్థావరాల గురించి నేవీకి మొత్తం తెలుసు.’ అని అన్నారు.
ప్రధాని సమీక్షలు
ప్రధాని మోదీ నివాసంలో పలువురు ఉన్నతస్థాయి అధికారులతో భేటీ జరిగింది. ఈ భేటీకి త్రివిధ దళాల అధిపతులతో పా టు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు.
పరిణామాలు తీవ్రంగా ఉంటాయి..
ఒక వేళ పాకిస్థాన్ గనుక దాడి చేస్తే భారత ప్రతిస్పందన అత్యంత దారుణంగా ఉంటుందని ప్రధాని మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్‌తో పేర్కొన్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్ గుండ్లు ప్రయోగిస్తే.. భారత్ ఫిరంగులు ప్రయోగించాలని మోదీ వ్యాఖ్యానించినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పాకిస్థాన్ గనుక ఒక్క బుల్లెట్ పేల్చినా భారత్ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని మోదీ పేర్కొన్నట్టు సమాచారం. వాన్స్ భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మొదలయిన వారితో చర్చలు జరిపారు.
పీవోకే అప్పగింతపైనే చర్చలు
పీవోకే, ఉగ్రవాదుల అప్పగింతపై మాత్రమే తాము చర్చిస్తామని ఆదివారం భారత వర్గాలు తెలిపాయి. అంతకు ముందు పీవోకే విషయంలో భారత్, పాక్‌ల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు.
ఈ విషయంపై స్పందించిన ప్రధాని భారత్-పాక్ మధ్య ఏ దేశం మధ్యవర్తిత్వం వహించడం అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ‘పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో మేము పూర్తి స్పష్టతతో ఉన్నాం. అందులో మాట్లాడేందుకు ఏమీ లేదు. వారు టెర్రరిస్టుల అప్పగింత గురించి మాట్లాడితే తప్పా మేము మాట్ల్లాడేందుకు ఏమీ లేదు. ఈ విషయంలో భారత్ ఎవరి మధ్యవర్తిత్వాన్ని కోరుకోవడం లేదు’ అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.