12-05-2025 02:45:16 AM
న్యూఢిల్లీ, మే 11: ‘పండ్లలో రారాజు మామిడి పండు’ అని మనందరికీ తెలుసు గానీ.. రెండు దేశాలు సామరస్యంగా సత్సంబంధాలు నెరపడంలో మామిడి పండు ముఖ్యపాత్ర పోషిస్తుందని ఎవరైనా ఊహించగలరా? భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో పాటు మరెన్నో దక్షిణాసియా దేశాలు శతాబ్దాల నుంచి ఈ మామిడి పండు దౌత్యాన్ని వినియోగిస్తున్నాయంటే నమ్ముతారా..? అవునండీ.. భారత మొట్టమొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నుంచి నిన్నమొన్నటి నేతల వరకూ.. ఎంతో మంది ఈ తరహా దౌత్యాన్ని వినియోగించి సక్సెస్ అయ్యారు.
అసలేంటి.. మామిడి దౌత్యం..?
మామిడి పండు దౌత్యం ఈనాటిది కాదు. 17వ శతాబ్దంలో నాటి పాలకులైన మొఘలులు ఇలాంటి దౌత్యాన్ని మొదటిసారిగా వినియోగించారు. నాడు మామిడిపండు మొఘలుల పాలన చిహ్నంగా ఉండేది. మొఘల్ చక్రవర్తులు ఔరంగజేబు, జహంగీర్, షాజహాన్ ఈ తరహా దౌత్యాన్ని వినియోగించారు. ఔరంగజేబు తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకున్న తర్వాత పర్షియన్ రాజు షా అబ్బాస్‌ను శాంతింపజేసేందుకు భారీగా మామిడి పండ్లు పంపినట్లు చరిత్ర కారులు చెప్తుంటారు.
అలాగే బాల్కన్ సంస్థాన సామంత రాజు కూడా ఔరంగజేబు కటాక్షం పొందేందుకు ఈ తరహా దౌత్యాన్ని వినియోగించాడు. అలా సామంత రాజు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 200 ఒంటెలకు మామిడి పండ్లు లోడ్ కట్టి ఔరంగజేబుకు పంపి ఆయన్ను ప్రసన్నం చేసుకున్నాడు.
చౌ ఎన్‌లైను మెప్పించిన మామిడి..
1955లో చైనా ప్రధానిగా చౌ ఎన్‌లై మొదటిసారి ఇండియాకు వచ్చారు. ఆయనకు భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆతిథ్యమిచ్చారు. ఆయన మొదటిసారి కమ్యూనిస్టు పాలన లేని భారత్ వంటి దేశానికి వచ్చి, ఇక్కడ దౌత్యపరమైన సంబంధాలను చక్కబెట్టుకునేందుకు వచ్చిన సందర్భమిది. నాడు నెహ్రూ స్వయంగా డైనింగ్ టేబుల్ వద్ద మామిడి పండు ముక్కలు కోసి చౌ ఎన్‌లై చేతికి అందించారు.
చౌ ఎన్‌లై ఒక్కో మామిడి పండు ముక్కను రుచి చూస్తూ పరవశించిపోయారు. నాటి క్షణాలను రచయిత డీఆర్ మానేంకర్ గుర్తుచేస్తూ.. ‘మామిడి పండ్లు తింటున్నప్పుడు చౌఎన్‌లై ముఖంలో రంగులు విరిశాయి. కనుబొమ్మలు విచ్చుకున్నాయి. ఒక్కో మామిడి తునక ఆయన దంతాల్లో చిక్కుకుంటుంటే, ఆయన ఆనందంగా వాటిని విదిలించుకుని తిన్నారు.
ఆ క్షణాల్లో చౌ ఎన్‌లై ముఖారవిందం వేయి పువ్వులై నవ్వింది’ అంటూ రాసుకొచ్చారు. చౌ భారత పర్యటన ఆయన్ను ఇండోనేషియాలోని ‘బాండుంగ్’లో నిర్వహించే సదస్సుకు ప్రాతినిథ్యం వహించేందుకు పాదులు వేసింది.
తొలిప్రధాని నెహ్రూ సైతం..
భారత మొట్టమొదటి ప్రధాని నెహ్రూకు మామిడి పండ్లంటే ఎంతో ఎక్కువ. ఆయన తన స్వస్థలమైన అలహాబాద్‌లో పండించిన మామిడి పండ్లను ఢిల్లీలోని తన నివాసానికి తెప్పించుకునేవారు. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఏ విదేశీ అతిథి లేదా ప్రధాని లేదా అధ్యక్షుడు భారత్‌కు విచ్చేసినా నెహ్రూ వారందరికీ మామిడి పండ్లనే బహూకరించేవాడు.
అతిథులు కూడా ఎంతో ఇష్టంగా తమ దేశాలకు మామిడి పండ్లు తీసుకెళ్లేవారు. ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ 1955 నాటి కథనం ప్రకారం.. ‘మరాఠా ప్రిన్సెస్’ విమానంలో 13 పెట్టెల్లో ఇండోనేషియాకు మామిడి పండ్లు వెళ్తున్నాయి. బాండుంగ్ ఆఫ్రో ఏషియన్ సదస్సుకు విచ్చే అతిథులందరికీ పసందైన మామిడి పండ్లే విందు’ అని పత్రిక ప్రముఖంగా ఓ కథనం ప్రచురించింది.
అక్కడికి వెళ్లిన మామిడి పండ్లు చివరకు అలీనోద్యమానికి బాటలు వేశాయని ఇప్పటికీ చరిత్రకారులు చెప్తుంటారు. ఇదే ఏడాది ‘ది టైమ్స్ ఇండియా మరో కథనాన్ని ప్రచురించింది. నాటి ప్రసిద్ధ రచయిత డీడీ మానేంకర్ ఈ వ్యాసం రాశారు. రష్యా భారత్ మధ్య కోల్డ్‌వార్‌ను పరిష్కరించడంలో నెహ్రూ మామిడి పండ్ల దౌత్యాన్ని వినియోగించాడనేది వ్యాసం సారాంశం.
నాడు నెహ్రూ ఏ విధంగా మాస్కోకు మామిడి పండ్లు పంపించారు? దౌత్యపరంగా రెండు దేశాల మధ్య సమస్యలను ఎలా పరిష్కరించారు’ అనే విషయాలు చెప్తూ ‘సొవియట్ నేతలు కొత్త వెలుగులు చూడడమే కాదు.. వారు సరికొత్త తీపిని రుచి చూస్తారు’ అని రచయిత రాసుకొచ్చారు.
చౌ ఎన్‌లైకు తప్పిన ప్రమాదం..
చౌ ఎన్‌లై బాండుంగ్ సమావేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే బీజింగ్ నుంచి హాంకాంగ్ వరకు విమానంలో వెళ్లి.. హాంకాంగ్‌లో ‘కాశ్మీర్ ప్రిన్సెస్’ విమానంలో బాండుంగ్ చేరుకోవాలని ఆ కాంక్షించారు. కానీ.. అనుకోని కారణాలతో తన ప్రయాణం ఆగిపోయింది. కాశ్మీర్ ప్రిన్సెస్ ఫ్లుటైను కొందరు పేల్చివేశారు. దీంతో ఫ్లుటై దక్షిణ చైనా సముద్రంలో కూలింది.
ఘటనలో 16 మంది ప్రయాణికులు, కొందరు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. చౌ ఎన్‌లై బాండుంగ్ సదస్సుకు హాజరైతే ఆ పరిణామాలు మరోలా ఉండేవని చరిత్రకారులు చెప్తుంటారు. చైన్యా, రష్యన్ అధినేతలు భారత పర్యటనకు వచ్చినప్పుడు నెహ్రూ మామిడి పండ్ల దౌత్యం వినియోగించారని ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి.