నేడు మహబూబాబాద్ జిల్లాకు మంత్రుల రాక
మహబూబాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా పర్యటన కు సోమవారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వస్తున్నారు. కేసముద్రం మండల పరిషత్ ఆవరణలో నిర్వహించే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు స్థాపన ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. కేసముద్రం (వి) లో కోటి 90 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభిస్తారు.
అనంతరం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నూతనంగా 4.6 కోట్లతో నిర్మించనున్న కేసముద్రం మున్సిపాలిటీ ఆఫీస్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే కార్యాలయాన్ని నూతనంగా జిల్లాలో ఇటీవల ఏర్పడ్డ ఇనుగుర్తి, సిరోల్, దంతాలపల్లి మండల కేంద్రాల్లో 2.25 కోట్ల చొప్పున ఒక్కో తహసిల్దార్ కార్యాలయాలను నిర్మించనున్నారు. వాటి నిర్మాణానికి కూడా ఇక్కడి నుండే వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు.
అనంతరం 8 ఏళ్ల కాలంగా భూమి హక్కులు లేక ఇబ్బందులు పడుతున్న నారాయణపురం గ్రామానికి చెందిన 780 మంది రైతులకు రీ సర్వే చేయించి ప్రభుత్వం నూతనంగా జారీచేసిన పట్టా పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేస్తారు. అనంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఇక్కడ నుండి మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు ఇతర అధికారులతో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షిస్తారు.
ఈ కార్యక్రమంలో రాజ్య సభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ తదితరులు పాల్గొంటారు.






