ప్రజావాణి నిర్వహణలో స్వల్ప మార్పులు
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ స్వల్ప మార్పులు చేపట్టారు. ఇప్పటి వరకు ఫిర్యాదుదారులు నేరుగా కలెక్టర్‌కు వినతిపత్రాలు అందించగా, ఇకపై ముందుగా సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల సూపరింటెండెంట్లు ఫిర్యాదులను పరిశీలించనున్నారు.
సమస్య ఏ శాఖకు సంబంధించినదో గుర్తించి సంబంధిత అధికారుల వద్దకు ఫిర్యాదుదారులను మార్గనిర్దేశం చేయనున్నారు. అనంతరం సంబంధిత శాఖ అధికారులు ఫిర్యాదులను స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నారు. ఉన్నతస్థాయి జోక్యం అవసరమైన అంశాలను మాత్రమే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురానున్నారు. ప్రతి ఫిర్యాదు అక్కడే వెనువెంటనే ఆన్లైన్ నమోదు ప్రక్రియ చేపట్టారు.
ఈ మార్పులతో ప్రజల సమస్యల పరిష్కారం వేగవంతం కావడంతో పాటు శాఖల మధ్య సమన్వయం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. సోమవారం జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి 61 దరఖాస్తులు అందినట్లు అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజావాణి కి వచ్చిన దరఖాస్తులను వెనువెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ జిల్లా అధికారులను ఆదేశించారు.






