13-12-2025 09:44:41 PM
పదేళ్లలో ఎంతోమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు
నేడు బీఆర్ఎస్ నాయకులు నీతులు వల్లించడం సిగ్గుచేటు
నూతన సర్పంచులు గ్రామాలను సర్వతో ముఖాభివృద్ధి సాధించేలా కృషి చేయాలి
ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి (విజయక్రాంతి): పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామాలన్ని నిర్వీర్యం అయిపోయాయని, ఎందరో సర్పంచులు అప్పుల బాధలు తాలలేక ఆత్మహత్యలు చేసుకున్న ఉద్ధాంతాలు ఎన్నో ఉన్నాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శనివారం వనపర్తి పట్టణంలోని తన నివాస కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి పేరా అధినాయకులు అందిన కాడికి దోచుకొని గ్రామస్థాయిలోని సర్పంచులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ప్రభుత్వ పరమైన ఇబ్బందులను తట్టుకోలేక చేసిన అప్పులు తీర్చుకోలేక ఎందరో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎమ్మెల్యే మేఘారెడ్డి విమర్శించారు.
సర్పంచుల ఆత్మహత్యలకు పరోక్షంగా కారణమైన నాయకులు నేడు నిస్సిగ్గుగా గ్రామాల అభివృద్ధి గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. పదేళ్లు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడితే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ సెంటిమెంట్ ఉధృతంగా ఉన్ననాడే ఓడిపోయిన వ్యక్తివి ఎందరో నాయకుల శ్రమ ఫలితంగా గెలిచి ఒక్కసారి పదవిలో ఉండి వందేళ్ళ సంపాదన సంపాదించుకున్న నీకు గ్రామాల అభివృద్ధి గురించి మాట్లాడి నైతిక హక్కు లేదన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్రంలో అంపశయ్యపై ఉందని మునిగిపోయే పడవలో ఎవరు ప్రయాణం చేయకూడదన్నారు. ఇలాంటి కబ్జాకోరుల మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. స్వయాన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత గారే వనపర్తి నియోజకవర్గంలో ఓ మాజీ మంత్రి వలన బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యమైందని చెప్పిన ఇక్కడి నాయకులకు మాత్రం సిగ్గు శరం లేదని ఆయన విమర్శించారు.
తల్లి లాంటి ఆడకూతురులపై ఇస్తానుసారంగా మాట్లాడే నీచుల మాటలు వనపర్తి ప్రజలు నమ్మబోరన్నారు. ఒకరు చెప్పుతో కొడతామని మరొకరు మా పేరు ఎత్తితే పుచ్చ లేచిపోద్ది అని అని హెచ్చరించిన నిస్సిగ్గుగా గ్రామాల్లో తిరగడం విడ్డూరంగా ఉందన్నారు. అవినీతి మహావృక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూకటి వేళ్ళతో పెకిలిస్తుందని ఈ సర్పంచ్ ఎన్నికలు నిరూపిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ మద్దతుతో విజయ్ సాధించిన సర్పంచులు వార్డు సభ్యులు ఉపసర్పంచులు ప్రతి ఒక్కరు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన పెద్దమందడి, గోపాల్పేట,రేవల్లి, ఖిల్లా ఘణపురం, ఏదుల మండలాలకు చెందిన పలువురు సర్పంచులను శాలువాలతో సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.