12 March, 2026 | 11:39 AM

థాయ్‌లాండ్ కార్గోషిప్‌పై క్షిపణిదాడి!

12-03-2026 01:38 AM
  1. హోర్ముజ్ జలసంధి గుండా భారత్‌కు వస్తున్న ఇంధన నౌక
  2. ఒమన్ తీర ప్రాంతం సమీపంలో మయూరీనారీని ఢీకొన్న ఇరాన్ ప్రాజెక్టైల్
  3. నౌక కింది భాగంలో భారీ రంధ్రం
  4. 22 మందిని కాపాడిన నేవీ
  5. మరో ముగ్గురు గల్లంతు

టెహ్రాన్, మార్చి 11: మధ్య ఆసియా దేశాల్లో గత 12 రోజులుగా వైమానిక, డ్రోన్లు, క్షిపణుల దాడులు తీవ్రంగా జరుగుతున్నయి. ఈ  ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న థాయ్‌లాండ్ కార్గోషిప్‌పై క్షిపణి దాడి జరిగింది. ఒమన్ తీర ప్రాంతం సమీపంలో కార్గోషిప్ మయూరీ నారీని ఇరాన్ ప్రాజెక్టైల్ ఢీకొన్నట్టు థాయ్ అధికారులు తెలిపారు. హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న థాయ్‌లాండ్ కార్గోషిప్‌పై క్షిపణి దాడి చేసింది.

నౌక కింది భాగంలో భారీ గొయ్యి ఏర్పడడమే కాకుండా, నౌక నుంచి భారీ పొగలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన థాయ్‌లాండ్ నేవీ, అంతర్జాతీయ తీరప్రాంత అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ప్రొజక్టైల్ దాడితో నౌకలో మంటలు చెలరేగి సగభాగం కాలిపోయిందని, 20 మంది సిబ్బందిని రెస్క్యూ టీమ్ కాపాడారు. మరో ముగ్గురు ఓడలోనే చిక్కుకుపోయారని తెలుస్తోంది.

మయూరీ నారీ ఇంధన నౌక గుజరాత్‌లోని కాండ్లా పోర్టుకు వస్తుండగా ఈదాడి జరిగింది. మరో రెండు నౌకలు కూడా భద్రతా కారణాలతో హోర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. ఆయిల్ టాంకర్ల కదలికలను అడ్డుకునేందుకు హోర్ముజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేసింది. దీంతో క్రూడాయిల్, గ్యాస్ రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ప్రపంచ దేశాలపై ఇప్పటికే ఈ ప్రభావం కనిపిస్తున్నట్టు ఆందోళనలు వ్యక్తమవుతుండగా, తాజాగా థాయ్‌లాండ్ కార్గోషిప్‌పై దాడి మరింత ఆందోళనకు తావిస్తోంది. ఈ నౌకను రెండు క్షిపణులు దాడి చేసినట్లు సమాచారం.