24-09-2025 05:58:18 PM
కరీంనగర్,(విజయక్రాంతి): చొక్కారావుపల్లి–ఖాజీపూర్ గ్రామాల మధ్య గల మానేరు వాగుపై వంతెన నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సన్మానించారు. బుధవారం ఆయన పార్టీశ్రేణులతో కలిసి కరీంనగర్ లోని కేంద్ర మంత్రి నివాసానికి వెళ్లి బండి సంజయ్ కుమార్ కు శాలువా కప్పి సన్మానించారు. నిధులు మంజూరు చేయించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ... వంతెన నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరుకు చేసిన కృషి శ్లాఘనీయమని బండిని కొనియాడారు. నిధుల మంజూరుతో ఏళ్ల నాటి వంతెన కల సాకారం కానున్నదని ఆయన పేర్కొన్నారు. నిధుల మంజూరుతో ఆ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన చెప్పారు. అనంతరం కరీంనగర్ చైతన్యపురిలోని మహాశక్తి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.