24-09-2025 08:07:46 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని తుంపెల్లి పెద్దవాగు వద్ద హై లెవెల్ వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డివైఎఫ్ఐ) ఆధ్వర్యంలో మంగళవారం స్థానికులు నిరసన తెలిపారు.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ తుంపెల్లి వాగు వద్ద ప్రస్తుతం ఉన్న వంతెన ఎత్తు తక్కువ ఉండడంతో వర్షాకాలంలో వాగు ఉప్పొంగినప్పుడు పూర్తిగా మునిగిపోతుందని, దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని తెలిపారు. ఆసిఫాబాద్ నుంచి తుంపెల్లి, మాలాన్‌గొంది, శేఖంగొండి గ్రామాలు, తిర్యాని మండలానికి వెళ్లే ప్రధాన రహదారి పై వంతెన లేకపోవడం వల్ల విద్యార్థులు, రైతులు, వృద్ధులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఎన్నో ఏళ్లుగా ప్రజల ఓట్లతో గెలుస్తున్న ప్రజాప్రతినిధులు కనీస వంతెన కూడా నిర్మించలేకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా వారు స్పందించి తుంపెల్లి వాగుపై హై లెవెల్ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు.ఆసిఫాబాద్ నుండి తుంపెల్లి, మాలాన్‌గొంది, శేఖంగొండి గ్రామాలకు వెళ్లే రహదారి ప్రస్తుతం గుంతలతో నిండిపోయిందని, ప్రయాణికులు రోజూ ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. రహదారిని తక్షణమే మరమ్మతు చేసి గుంతలు పూడ్చాలని ప్రభుత్వాన్ని కోరారు.సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించకపోతే ప్రజలను చేర్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.