19-05-2024 12:05:00 AM
ధాన్యం కొనుగోళ్లు ఆలస్యంపై ఎమ్మెల్యే హరీష్‌బాబు ఫైర్
అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి డిమాండ్
ప్రభుత్వ అధికారుల పనితీరుపై సభ్యుల అభ్యంతరాల వెల్లువ
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 18 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో శనివారం జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు అధ్యక్షతన జరిగిన జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. సమావేశానికి కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, పాల్వాయి హరిష్‌బాబు హాజరయ్యారు. ముందుగా పలుశాఖల అధికారులు తమ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులపై నివేదికలు వినిపిం చారు. నివేదికలపై తొలుత ఎమ్మెల్యే కోవ లక్ష్మి స్పందిస్తూ.. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను సత్వరం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నకిలీ పత్తి విత్తనాల విక్రయాలకు అడ్డకట్ట వేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు, పోలీసులు చొరవ తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు మాట్లాడుతూ.. అధికారులు జిల్లా వ్యాప్తంగా 48 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 5 శాతమైనా పూర్తి చేయకపోవ డంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులు రైస్ మిలర్లతో కుమ్మక్కయి రైతులను నట్టేట ముంచుతున్నారని ఆరోపించారు. వారు ఇదే పద్ధతి కొనసాగిస్తే మున్ముందు రైతులతో కలిసి ఆందోళలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వైద్యారోగ్యశాఖ, ఇంజినీరింగ్, సివిల్ సప్లయి అధికారులు దళారులతో మిలాఖత్ అయి మాఫియా నడుపుతున్నారని మండిపడ్డారు. వైద్యసిబ్బంది 30 శాతం కమిషన్ కోసం పేద ప్రజలను ప్రైవేటు ఆసుపత్రులకు సిఫార్సు చేస్తున్నారని ధ్వజమె త్తారు. అటవీశాఖ అధికారులు పోడు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కలెక్టర్ వెంటనే స్పందించి అటవీశాఖ వేధింపుల నుంచి పోడు రైతులకు విముక్తి కల్పించాలని కోరారు. సమావేశంలో జడ్పీ సీఈవో అనిల్‌కుమార్, జడ్పీటీసీలు అరిగెల నాగేశ్వర్‌రావు, అజయ్‌కుమార్, దుర్పాద భాయి, సంతోష్‌కుమార్, ఎంపీపీలు మల్లికార్జున్ యాదవ్, సౌందర్య, పెందుర్ తులసీరాం, విశ్వనాథ్, విమల పాల్గొన్నారు.