14 April, 2026 | 10:13 PM

గోపాల్ పేట్ బస్ స్టాండ్ పునర్నిర్మాణం చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్

14-04-2026 06:27 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని గోపాల్ పేట్ బస్ స్టాండ్‌కు ఏళ్ల తరబడి కొనసాగిన నిర్లక్ష్యానికి తెరపడింది. శిధిలావస్థలో ఉండి ప్రయాణికులకు ప్రమాదకరంగా మారిన ఈబస్ స్టాండ్‌ను రూ.40 లక్షల వ్యయంతో స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పునర్నిర్మించారు. ఇప్పటివరకు బస్ స్టాండ్ దయనీయ స్థితిలో ఉండటంతో, ప్రయాణికులు చెట్ల కింద ఎండలో నిలబడి, వర్షంలో తడుస్తూ బస్సుల కోసం వేచి ఉండాల్సి వచ్చిన పరిస్థితి నెలకొంది. సమస్యపై పలుమార్లు వినతులు ఇచ్చినా గత ప్రభుత్వాలు,అధికారులు స్పందించకపోవడంతో ప్రజల్లో అసహనం పెరిగింది.

ఈ సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గోపాల్పేట్ బస్టాండును స్వయంగా స్థలాన్ని పరిశీలించి, వెంటనే చర్యలు ప్రారంభించారు. రవాణా శాఖ మంత్రిని పలుమార్లు కలిసి నిధుల కోసం ఒత్తిడి తెచ్చి, చివరకు రూ.40 లక్షల,, నిధులను మంజూరు చేయించారు. ఆ నిధులతో పాత బస్ స్టాండ్‌ను పూర్తిగా మరమ్మత్తులు చేసి,ఆధునిక సదుపాయాలతో కొత్త రూపంలో నిర్మించారు. మంగళవారం గోపాల్పేట్ బస్టాండు ప్రారంభోత్సవంలో భాగంగా  ఎమ్మెల్యే మాట్లాడుతూ... గోపాల్పేట్ ప్రజలు చెట్ల కింద పిల్లలతో కలిసి బస్సు కోసం ఎదురు చూస్తున్న దృశ్యం నాకు తీవ్రంగా బాధ కలిగించింది. అప్పుడే ఈసమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని నిర్ణయించుకున్నాను.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చడం నా బాధ్యత” అని తెలిపారు. అలాగే గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల గ్రామీణ రవాణా వ్యవస్థ దెబ్బతిన్నదని,ప్రస్తుతం ప్రతి సమస్యకు పరిష్కారం అందించడం ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పేర్కొన్నారు.కొత్తగా నిర్మితమైన బస్ స్టాండ్ ప్రారంభంతో గోపాల్పేట్ ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది.ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడిగా ఎమ్మెల్యేకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాల్పేట్ గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డి, రామచందర్ రెడ్డి, లక్ష్మణ్ ఠాగూర్, సాయగౌడ్, శ్రీరామ్ గౌడ్, మన్నె వెంకటి, ఫారుక్, గులాం హుస్సేన్, సుధాకర్, ఇమామ్, తదితరులు పాల్గొన్నారు.