15 April, 2026 | 11:35 PM

వ్యవసాయ క్షేత్రంలో వెళ్లేందుకు రైతుల సమస్య పరిష్కారం

07-06-2025 03:00 PM

రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ

ఆదిలాబాద్,(విజయక్రాంతి): వర్ష కాలంలో రైతులు తమ  వ్యవసాయ క్షేత్రానికి (చేను)లకు వెళ్లడానికి సరైన రహదారులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించడంతో ప్రభుత్వం స్పందించి పొలం బాట కార్యక్రమాన్ని చేపట్టిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఇందులో భాగంగా శనివారం జైనథ్ గ్రామం నుండి చేనులకు పోవడానికి రూ.28 లక్షల నిధులతో సుమారు 5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ... విడతలవారీగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల రైతులు వర్షాకాలం సైతం చేనులకు వెళ్లే విధంగా రోడ్డు సౌకర్యం కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఇప్పటికే ఒక ప్రణాళిక రూపొందించామని అన్నారు. చేనులకు రోడ్లు వేసే సమయంలో ఇరుకుగా ఉన్న మార్గం ఉన్న చోట రైతులు సైతం స్థలం ఇవ్వడానికి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, నాయకులు అశోక్ రెడ్డి, ప్రతాప్ యాదవ్, రాకేష్ రెడ్డి, లక్ష్మణ్, రమేష్ రెడ్డి, అశోక్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.