calender_icon.png 8 November, 2025 | 10:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడా స్ఫూర్తిని కలిగి గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలి

08-11-2025 08:55:03 PM

- 69వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పాయం 

- జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

- ప్రారంభోత్సవానికి హాజరైన జిల్లా ఎస్పీ, డీఈఓ

పినపాక,(విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండి గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ క్రీడాకారులకు సూచించారు. శనివారం రాష్ట్రస్థాయి 69వ బాల, బాలికల కబడ్డీ పోటీలు పినపాక మండలం ఈ బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్ లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను  ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, డిఇఓ నాగలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

అనంతరం పది జిల్లాల క్రీడాకారుల చేత గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పినపాక నియోజకవర్గానికి రాష్ట్రస్థాయి క్రీడలు కేటాయించిన  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, క్రీడా మంత్రులకు,  జిల్లా కలెక్టర్ కు జిల్లా అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కంది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందించడం గొప్ప విషయం అని కొనియాడారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడల్లో సామర్థ్యాలను మెరుగుపరచుకుంటూ విజయ బావుటాను ఎగురవేయాలని అన్నారు.

ఆరోగ్యకరమైన జీవనశైలిని నడిపించడానికి శారీరక కార్యకలాపాల్లో విస్తృతంగా పాల్గొనాలని సూచించారు. అండర్-17 రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించడంలో క్రీడా అధికారుల కృషిని ఆయన ప్రశంసించారు. అథ్లెట్ల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతను కొనియాడారు. విద్యార్థులు క్రీడలలో విజయ బహుట ఎగరవేసి పాల్గొనేలా ప్రోత్సహించారు. అనంతరం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ  మారుమూల గిరిజన గ్రామం ఈ బయ్యారంలో రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడల వేదిక కావడం గర్వంగా ఉందన్నారు.

క్రీడాకారులను అభినందించారు. అనంతరం కంది  చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంది సుబ్బారెడ్డి మాట్లాడుతూ... ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రీడాకారులతో  వసతితో పాటు భోజన సౌకర్యం సైతం కల్పించినట్లు వివరించారు. క్రీడాకారులకు దుస్తులు సైతం అందించినట్లు తెలిపారు. విద్యాబుద్ధులతో పాటు విద్యార్థులకు క్రీడలు సైతం అవసరం అన్నారు. అనంతరం డిఇఓ నాగలక్ష్మి మాట్లాడుతూ క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యాశాఖ పరంగా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. రాత్రిపూట సైతం పాఠశాలల్లో వసతి ఏర్పాటు చేయడమే కాక నాణ్యమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు.

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ఏజెన్సీ ప్రాంతంలో జరగటం రాష్ట్రానికే గర్వకారణం అన్నారు. కంది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ గేమ్స్ నిర్వహిస్తున్న కారణంగా వారిని అభినందించారు. అనంతరం ఎంఈఓ నాగయ్య, ఎంపీడీవో  సంకీర్త్, ఎంపీ ఓ వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ సానిటేషన్ పరంగా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని తెలిపారు. ఎక్కడ ప్లాస్టిక్ వ్యర్ధాలు లేకుండా చూస్తున్నామని, క్రీడాకారుల కోసం బయో టాయిలెట్లు సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సీఐ వెంకటేశ్వరరావు నేతృత్వంలో పోలీస్ బందోబస్తు భారీగా ఏర్పాటు చేశారు. క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా వీక్షకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. అనంతరం ఏ జి హెచ్ ఐలాపురం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. జిల్లా కలెక్టర్ టాస్ వేసి కబడ్డీ క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోర హోరిగా నాలుగు మ్యాచులు నిర్వహించినట్లుగా క్రీడల కార్యదర్శి నరేష్, పిడి వీరన్న తెలియజేశారు.