మోదీ, పినరయ్ ఒక్కటే
- కేరళంకు భవిష్యత్ లేకుండా చేయాలని చూస్తున్నారు
- ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేరళం సీఎం పినరయ్ విజయన్ ఒక్కటేనని, వారిద్దరికీ తేడాలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కేరళం ప్రజలు మతతత్వ శక్తులను ఎప్పటికీ అంగీకరించరని, మతతత్వ శక్తులు కేరళంలో ప్రవేశించకుండా ఇక్కడి ప్రజలు లక్ష్మణరేఖ గీశారని తెలిపారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కాంగ్రెస్ నేతృత్వంలోని ఐక్య ప్రజాస్వామ్య సంఘటన (యూడీఎఫ్) తరపున రేవంత్‌రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు.
ముట్టతార వద్ద నిర్వహించిన రోడ్ షోలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కేరళం ప్రజలు చదువుకున్నవారని, తెలివైనవారన్నారు. నరేంద్ర మోదీ, పినరయ్ విజయన్, కేరళంకు భవిష్యత్ లేకుండా చూస్తున్నారని విమర్శించారు. అందుకే బీజేపీ నాయకులు తమ ఓటు బ్యాంకును పినరయ్ విజయన్‌కు బదిలీఅయ్యేలా చేస్తూ కాంగ్రెస్ మిత్రపక్షాలు గెలవకూడాదని ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి, కేరళంను అభివృద్ధి చేసేవారికే ఓటువేసి గెలిపించాలని కోరారు. తెంగాణను కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ దత్తత తీసుకున్నారని, ఆమె చొరవతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని, దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.




