వికసిత్ భారత్--47 లక్ష్య సాధనకు మోదీ కృషి
ముషీరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): వికసిత్ భారత్-2047 లక్ష్య సాధన కోసం ప్రధాని మోడీ నిరంతరం కృషి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి పేర్కొన్నారు. దేశంలో బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, పేదరిక నిర్మూలన, సమగ్ర అభివృద్ధితో పాటు నాణ్యమైన విద్య, వైద్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే మోదీ ధ్యేయమని ఆమె అన్నారు.
బీజేపీ గోల్కొండ జిల్లా ఆధ్వర్యంలో శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నరేంద్ర మోదీ13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, గత12 సంవత్సరాలుగా దేశ ప్రధానమంత్రిగా సేవలందిస్తూ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారని తెలిపారు.
మోదీ కేవలం ప్రధానమంత్రిగా కాకుండా దేశానికి ’ప్రధాన సేవకుడు’గా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. మోదీ నాయకత్వం, సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో కూడా బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పార్టీ శ్రేణులు కృషి చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు.






