14 June, 2026 | 1:41 AM

రహ్మత్‌నగర్‌లో మంచినీటి సమస్య

14-06-2026 12:00 AM

అధికారుల నిర్లక్ష్యంపై మాజీ కార్పొరేటర్ దేదీప్య ఆగ్రహం

జూబ్లీహిల్స్, జూన్ 13 (విజయక్రాంతి): రహ్మత్ నగర్ డివిజన్ పరిధిలోని హనుమాన్ కమాన్ గల్లీలో స్థానికులు తీవ్ర మంచినీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ కార్పొరేటర్ దేదీప్య ఆ ప్రాంతంలో శనివారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాగునీటిలో డ్రైనేజీ, ఇతర కాలుష్య కారకాలు కలుస్తున్నాయని.. దీనివల్ల అనారోగ్యం బారిన పడాల్సి వస్తోందని ఆవేదన చెందారు.

సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని వాపోయారు. మాజీ కార్పొరేటర్ దేదీప్య మాట్లాడుతూ కనీస బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారులు స్పందించి కలుషిత నీటి సమస్యను, తాగునీటి ఎద్దడిని యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని డిమాండ్ చేశారు.