04-05-2024 01:59:41 AM
మధుయాష్కీగౌడ్, సునీతామహేందర్‌రెడ్డి
హయత్‌నగర్‌లో లంబాడీల ఆత్మీయ సమ్మేళన నిర్వహణ
ఎల్బీనగర్, మే 3: తెలంగాణలో పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనను అంతమొందించినట్లే కేంద్రంలోని మోదీ సర్కార్‌ను సాగనంపాలని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీగౌడ్, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి సునీతామహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజక వర్గంలోని మన్సూరాబాద్, హయత్‌నగర్ డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీరన్నగుట్ట నుంచి బంజారాకాలనీ వరకు పాద యాత్ర చేశారు. అనంతరం హయత్‌నగర్‌లోని స్వామీశంకర్ ఫంక్షన్‌హాల్‌లో లంబా డీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. లంబాడీ వేషధారణలో సునీతామహేందర్‌రెడ్డి గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేసి ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ... కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. అదే మళ్లీ బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మార్చుతారని, రిజర్వేషన్లను ఎత్తేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణకు మోదీ ప్రభు త్వం ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్ తెలంగాణలో గెలవలేమనే బీజేపీకి మద్దతు ఇస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రకటించిన ఐదు గ్యారెంటీలకు ప్రజలు మద్దతు ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్ వస్తే ప్రతి మహిళకు ఏడాదికి రూ.లక్ష ఆర్థికసాయం, నిరుద్యోగులకు రూ.లక్ష భృతి, కార్మికులకు కనీస వేతనం, రైతులకు కనీస మద్దతు ధర ఇస్తామని తెలిపారు.
తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి పాలన ప్రజారంజకంగా ఉందని కితాబునిచ్చారు. సునీతామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తనను ఎంపీగా గెలిపిస్తే నిత్యం ప్రజల మధ్యనే ఉంటానన్నారు. ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో హస్తినాపురం డివిజన్‌కు చెందిన వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయా కార్యక్రమాల్లో రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, టీపీసీసీ ప్రతినిధి ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేటర్ సుజాతానాయక్, నాయకులు ముద్దగొని రామ్మోహన్‌గౌడ్, వజీర్ ప్రకాశ్‌గౌడ్, చిన్నగొని వరి, బుడ్డ సత్యనారాయణ, గుర్రం శ్రీనివాస్‌రెడ్డి, గజ్జి శ్రీనివాస్‌యాదవ్, గుర్రం శ్యామ్‌చరణ్‌రెడ్డి, కళ్లెం సుజాతారెడ్డి, డేరంగుల కృష్ణ, నల్ల రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.