calender_icon.png 26 December, 2025 | 7:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరకట్నం వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

26-12-2025 05:51:26 PM

అత్తింట్లో అడుగుపెట్టిన 8 నెలలకే...

అడవి శ్రీరాంపూర్ లో పుట్టింటికి వచ్చి... ఉరి తాడుకు వేలాడి

మంథని డివిజన్ లో విషాదం

మంథని,(విజయక్రాంతి): అత్తింట్లో అడుగుపెట్టి... కొత్త జీవితం ప్రారంభించి.. 8 నెలలకే.. పుట్టింటికి వచ్చి.. ఉరి తాడుకు వేలాడి వివాహిత ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారకర ఘటన పెద్దపల్లి జిల్లా మంథని డివిజన్ లో విషాదం అలుముకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన  అంజలి (21) వివాహమై ఏడాది తిరక్కముందే అత్తింటి వేధింపులకు బలైంది. మల్హర్ మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన బండి వెంకటేష్ తో 8 నెలల క్రితం వివాహం జరిగింది.

పెళ్లి సమయంలో కట్నం కానుకలతో పాటు తమ కూతుర్ని అత్తింట్లో దింపి వచ్చారు. కొద్ది నెలలపాటు వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగింది. ఆ తర్వాత భర్త, అత్తింటి వారి వేధింపులు మొదలయ్యాయి. ఆశించిన వరకట్నం తేలేదంటూ సూటిపోటి మాటలకు ఆడబిడ్డ ఎంతో మనోవేదన అనుభవించింది. చివరకు ఆవేదింపులు తాళలేక ఈ జీవితం వద్దనుకొంది. నెల రోజుల క్రితం పుట్టింటికి వచ్చిన అంజలి గురువారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంటిపై కప్పుకు ఉరి వేసుకుని ప్రాణాలు విడిచింది.

కాగా ప్రస్తుతం అంజలి గర్భవతి కూడా. తమ కూతురు ఆత్మహత్యకు అత్తింటి వారి వేదింపుల కారణమని  కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలం కు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే పెళ్లయిన కొద్ది నెలలకే ఓ గర్భిణీ పుట్టింటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అందరిని కలిచి వేసింది. ఘటనా స్థలానికి గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ తో పాటు మంథని సీఐ రాజు, ముత్తారం ఎస్ఐ రవికుమార్  చేరుకొని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నారు.