భారతదేశ గతినే మార్చిన మహనీయుడు మోదీ
- దేశ సుస్థిర పాలనకు మద్దతు ఇవ్వండి
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్, జూన్ 21 (విజయ క్రాంతి): 12 ఏళ్ల పాలనలో భారత దేశ గతినే మార్చేసిన మహనీయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకుని ఆదివారం కరీంనగర్ లోని ఈఎన్ గార్డెన్స్ లో నిర్వహించిన “మేధావుల సదస్సుకు కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 12 ఏళ్ల మోదీ పాలన ఒక్క అవినీతికి తావులేకుండా సుస్థిర పాలనతో భారత్ ను అగ్ర రాజ్యాల సరసన చేర్చి భారతదేశ గతినే మార్చేశారని అన్నారు. డిజిటల్ ఇండియా విషయంలో విప్తవం స్రుష్టించారన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలోనూ సునామీ స్రుష్టించారని చెప్పారు.
సామాన్య ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహానీయుడు మోదీ అని కొనియాడారు. కిసాన్ సమ్మాన్ నిధి, ఎరువుల సబ్సిడీ, కిసాన్ క్రెడిట్, ఇన్సూరెన్స్, భూసార పరీక్షలతో రైతుల జీవితాలను మార్చే దిశగా అనేక పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. దేశంలోకి వచ్చిన రోహింగ్యాలు, అక్రమ చొరబాటుదారులంతా 2014కు ముందు వలస వచ్చిన వాళ్లేనని చెప్పారు. మోదీ పాలనలో అక్రమ చొరబాట్లపై ఉక్కుపాదం మోపారన్నారు. సర్ పేరుతో ఓట్ల తొలగింపుపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు.
బంగ్లా, పాకిస్తాన్ నుండి బెంగాల్ కు అక్రమంగా వలస వచ్చిన ముస్లిం ఓట్లను తొలగిస్తే తప్పేంటని ప్రశ్నించారు. తెలంగాణలోనూ నిజమైన పౌరుడి ఓట్లను తొలగించే అవకాశమే లేదన్నారు. ముస్లింలు సహా ప్రతి ఒక్కరూ తమ ఓటు ఉండేలా చూసుకోవాలని సూచించారు. అక్రమ చొరబాటుదారుల ఓట్లను, దొంగ ఓట్లను కచ్చితంగా తొలగించాల్సిందేనన్నారు. 2014కు ముందు యూపీఏ పాలనంతా 2జీ స్కాం, 3జీ స్కాం, బొగ్గుసహా రోజుకో అవినీతి కుంభకోణమేనని అన్నారు.
పంచభూతాలను అవినీతిమయం చేశారని ఎద్దేవా చేశారు. బలహీనమైన ప్రధాని, బలహీనమైన నిర్ణయాలు, విధాన నిర్ణయాల్లో శూన్యత, ప్రపంచ వేదికపై అత్యంత పరిమిత ప్రభావం భారత్ దాని అన్నారు. ఎన్డీఏ 12 పాలనలో పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. అవినీతిరహిత పాలన కొనసాగుతోందని, బలమైన ప్రధానమంత్రి ఉన్నారని, విధాన నిర్ణయాల్లో తెగువ చూపుతున్నారన్నారు. ప్రపంచ రాజకీయాల్లో కీలక శక్తిగా భారత్ ఎదిగిందన్నారు. దూరదృష్టి, ధైర్యం, మోదీ నాయకత్వమే కారణంమని తెలిపారు. ప్రధాని పదవి అంటే కొన్ని కుటుంబాలకే పరిమితం అనే స్థితినుండి సామాన్యుడు కూడా ప్రధాని కావొచ్చని నిరూపించిన నేత మోదీ అని అన్నారు.
తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు......12 ఏళ్లలో 13 లక్షల కోట్ల రూపాయల ఖర్చు చేశామని తెలిపారు. పన్నుల వాటా 1 లక్షా 18 వేల కోట్లు, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కింద 1 లక్ష కోట్లు ఇచ్చామని అన్నారు. కేంద్రమే వడ్డీ భరిస్తూ 50 ఏండ్ల వడ్డీ లేని రుణం కింద తెలంగాణకు దాదాపు 10 వేల కోట్ల సాయం అందించామన్నారు. వడ్ల కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై దుష్ప్రచారం చేస్తోందన్నారు. వాస్తవానికి ప్రతి గింజను కేంద్రమే కొంటోందని, రాష్ట్ర ప్రభుత్వం మధ్య దళారి మాత్రమేనని అన్నారు. కొనుగోలు చేసి కేంద్రానికి అప్పగించినందుకు కమీషన్ కూడా చెల్లిస్తున్నామని, అయినా వడ్లు కొనడం లేదని చెప్పడం బాధాకరమన్నారు.
మోదీ 12 ఏళ్ల పాలనలో దేశానికి జరిగిన మేలును సామాన్య ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలని కోరారు. మోదీ పాలనకు బహిరంగంగా మద్దతిచ్చి ఆశీర్వదించాలన్నారు. ఈ దేశ భవిష్యత్తు కోసం, సుస్థిర పాలన కోసమైనా మోదీకి సంపూర్ణ మద్దతు ప్రకటించాలని మేధావులను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, ఎల్‌ఐసీ సౌత్ జోన్ అధ్యక్షులు రాజయ్య, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు ఆకుల శైలజ, తదితరులు పాల్గొన్నారు.






