calender_icon.png 7 August, 2025 | 2:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షాంఘై సదస్సుకు మోదీ

07-08-2025 01:49:45 AM

- భారత ప్రధాని చైనా పర్యటన ఖరారు

- తియాంజిన్ వేదికగా ఎస్‌సీవో సమావేశం

- జిన్‌పింగ్, పుతిన్‌లతో ప్రత్యేక భేటీ జరిగే అవకాశం

- గల్వాన్ ఘర్షణ అనంతరం తొలిసారి చైనా పర్యటనకు..

న్యూఢిల్లీ, ఆగస్టు 6: భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. తియాంజిన్ వేది కగా ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో జరగనున్న షాంఘై సహకార సదస్సు (ఎస్‌సీవో సమ్మిట్)లో పాల్గొనేందుకు మోదీ చైనా వెళ్లనున్నారు. గల్వాన్ ఘర్షణ అనంతరం మోదీ చైనాలో పర్యటిస్తుండడం ఇదే తొలిసారి. చివరగా మోదీ 2019లో చైనాలో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే చైనాకు వెళ్ల డానికి ముందు ఆగస్టు 30న మోదీ జపాన్‌లో పర్యటించనున్నారు.

భారత్ వార్షిక సదస్సుకు ఆ దేశ ప్రధాని ఫుమియో కిషిదాతో కలిసి మోదీ హాజరవ్వనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా చైనా వెళ్లనున్నట్టు సమాచారం. ఇక చైనా పర్యటనలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌లతో మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలు స్తోంది. గతేడాది కజాన్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో జిన్‌పింగ్‌తో మోదీ భేటీ అయిన సంగతి తెలిసిందే. రష్యాతో చమురు వ్యాపారం చేస్తున్న భారత్‌పై అమెరికా 25 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.

24 గంటల్లో భారత్‌పై మరిన్ని సుం కాలు పెంచనున్నట్టు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో రష్యా మాత్రం భారత్‌కు మద్దతుగా నిలుస్తోంది. షాంఘై సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్, మోదీల మధ్య ప్రధానంగా ట్రంప్ సుంకాల అంశంతో పాటు ఇరు దే శాల మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చ జరిగేందుకు ఆస్కారముంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తాజా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

కాగా చైనాలో ఈ ఏడాది జూన్‌లో జరిగిన ‘షాంఘై సహకార సంస్థ’ సభ్యదేశాల రక్షణ మంత్రుల సదస్సులో కేం ద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. పాక్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదం, పహ ల్గాం ముష్కర దాడులను ప్రస్తావించకపోవడంపై తీవ్రంగా పరిగణించిన భారత్.. ఉమ్మ డి ప్రకటనపై సంతకం చేసేందుకు నిరాకరించింది. ఎలాంటి ఉమ్మడి ప్రకటన లేకుండానే చర్చలు ముగిశాయి. అనంతరం జూలైలో జరిగిన విదేశాంగ మంత్రుల సదస్సులో భా రత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పా ల్గొన్న సంగతి తెలిసిందే.