సెక్యూరిటీగార్డుకు ‘ఉగ్ర’ లింకులు
- బెంగళూరులో నిందితుడి అరెస్ట్
- టీటీపీతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు
బెంగళూరు, ఆగస్టు 15: అఫ్గానిస్థాన్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రముఠాతో సంబంధం ఉన్న సెక్యూరిటీగార్డు అసఫూల్ మాలిక్ అనే యువకుడిని శనివారం బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తెహ్రీక్- ఎ- తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ) సభ్యుడితో కలిసి ఆ సంస్థలో చేరడానికి ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు.
అనుమానాస్పద ఆన్‌లైన్ కార్యకలాపాలపై సమాచారం అందడంతో అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల జిల్లా చెందిన అసఫూల్ మాలిక్(25) ఏడాదిగా బెంగళూరులోని జిగాని ప్రాంతంలో నివసిస్తూ.. ఓ టెక్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.
ఫేస్‌బుక్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఇమ్రాన్ హైదర్ అనే వ్యక్తితో నిందితుడికి పరిచయం ఏర్పడింది. దీంతో కొంతకాలంగా అతడు అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు బొమ్మసంద్ర ఇండస్ట్రియల్ ఏరియాలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా ఉగ్రవాద సంస్థలతో లింకులు బయపడ్డాయి. ఇతను పాక్ తాలిబన్(టీటీపీ) సభ్యుడిగా ఉన్నట్లు తెలిపారు.
అలాగే పాకిస్థాన్ సైన్యం పాల్పడుతున్న అణచివేత చర్యలపై, ఇజ్రాయెల్- వ్యవహారంలో పాక్ వైఖరిపై నిందితుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో పాక్ సైన్యాన్ని దెబ్బతీయాలని పథకం వేశాడు. ఆఫ్ఘనిస్తాన్ వెళ్లి ఉగ్ర శిక్షణ పొందాలని పాస్పోర్ట్ తీసుకుని వీసాకు కూడా దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతల వల్ల ఆ ప్రయాణాన్ని విరమించుకున్నాడు. అఫ్గాన్‌కు చెందిన టీటీపీ ఉగ్రసంస్థ హ్యాండ్లర్‌తో అతడు తరచూ సంప్రదింపులు జరుపుతున్నాడు.
భారత్, పాకిస్థాన్‌లో దాడులకు వారు ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం అఫ్గాన్‌కు వెళ్లి.. ఉగ్ర సంస్థలో చేరడానికి అతడు సిద్ధమవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పాకిస్థాన్‌లోని ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్న ఇద్దరు ఉత్తర్‌ప్రదేశ్ వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), 2023లోని సెక్షన్ 113(3) కింద హెబ్బగోడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.






