calender_icon.png 23 May, 2025 | 7:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైకు లాక్కుంటామని బెదిరించి డబ్బులు దోపిడీ

23-05-2025 12:00:00 AM

రాజేంద్రనగర్, మే 22: బైకు ఫైనాన్స్‌లో ఉందని బెదిరించి ఇద్దరు వ్యక్తులు డబ్బులు దోచుకున్న సంఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కుతుబుద్దీన్ గూడ గ్రామానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ బషీర్ ఏసి రిపేర్ చేస్తుంటాడు.

ఆయన ఈనెల 20న మధ్యాహ్నం తన బంధువుకు చెందిన షైన్ బైకుపై అత్తాపూర్ లోని కాలా హనుమాన్ టెంపుల్ సమీపంలో పిల్లర్ నెంబర్ 161 దగ్గర మెహిదీపట్నం నుంచి ఆరంగర్ వైపు వెళ్తున్నాడు. ఇద్దరు వ్యక్తులు రిలయన్స్ మార్ట్ వద్ద అతడిని అడ్డగించారు. అందులో ఒకరు సిక్కుల పగిడి ధరించి ఉన్నారు. అతడిని పిల్లర్ నెంబర్ 161 సమీపంలో ఉన్న కాలా హనుమాన్ టెంపుల్ వైపు తీసుకెళ్లారు.

బైకు ఫైనాన్స్ లో ఉందని చెప్పి దాని కీ తీసుకునేందుకు యత్నించారు. వాహనాన్ని సీజ్ చేస్తామని, అలా కావద్దు అంటే 8 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీ గుర్తింపు కార్డులు చూపించాలని బాధితుడు ప్రశ్నించగా అతనిని పగిడి ధరించిన వ్యక్తి చెంపపై కొట్టాడు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించాడు.

వారికి బాధితుడు తన స్నేహితుడిని పిలిపించుకొని చివరికి వారికి 2500 ఇచ్చాడు. తన నుంచి డబ్బులు లాక్కున్న వారిని గుర్తిస్తానని వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు గురువారం అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.