9 July, 2026 | 4:49 AM

మున్సిపాలిటీల్లో మనీపాలిటిక్స్

11-06-2024 12:50 AM

జగిత్యాల జిల్లాలో జోరుగా అవినీతి

అధికారులు, పాలకవర్గం కుమ్మక్కు

ఆఫీసులో ప్రతి పనికో రేటు ఫిక్స్

నెలవారీ మామూళ్లకు పాలకవర్గమే కక్కుర్తి

బదిలీ బాటపట్టిన పలువురు అధికారులు

విచారణకు ఆదేశించిన కలెక్టర్?

జగిత్యాల, జూన్ 10 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లాలోని మున్సిపాలిటీల్లో మనీ పాలిటిక్స్ రాజ్యమేలుతున్నట్లు తెలుస్తోంది. పాలకవర్గమే కమిషన్ల కక్కుర్తితో అవినీతికి అర్రులుచాస్తున్నట్లు తెలుస్తోంది. నెలవారీ టార్గెట్లతో అధికారులపై ఒత్తిళ్లు పెంచి మరీ ప్రజలను పిండుకుతింటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దళారీ వ్యవస్థతో మున్సిపాలిటీల్లో పాలన అస్తవ్యస్తంగా తయారైందనుకుంటే పాలకవర్గాల ప్రోద్బలంతో ఆఫీసుల్లో ప్రతి పనికో రేటు ఫిక్స్ చేసినట్లు బాహాటంగానే చర్చ జరుగుతోంది.

జగిత్యాల మున్సిపల్‌లో దాదాపు అన్ని శాఖల్లో  ప్రజల అవసరాన్ని బట్టి డబ్బులు తీసుకుని పనుల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో అక్రమార్కులకు సైతం అధికారులు, పాలకవర్గం చేతులు కలిపి పెద్దమొత్తంలో జేబులు నింపుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్ల వద్ద కమిషన్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పాలకవర్గం అధికారులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు సమచారం. పనులు పూర్తికాకపో యినా కమిషన్ల కక్కుర్తితో ముందే బిల్లులు శాంక్షన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విష యం కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా  దృష్టికి వెళ్లడంతో ఇటీవల విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

పాలకులే కక్కుర్తి..

పాలకవర్గంలోని కీలక నేతలకు మున్సిపాలిటీలు కల్పతరువుగా మారాయి. మున్సి పాలిటీల్లో మూడు కీలక సెక్షన్లలోని అధికారులపై మామూళ్ల కోసం ఒత్తిళ్లు చేస్తున్నట్లు చెబుతున్నారు, నేతల వేధింపులు భరించలేక కొందరు అధికారులు బదిలీ ప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీల పరిధిలో ఇంటి, జాతీయ రహదారి వెంట వ్యాపార, వాణిజ్య షాపింగ్ కాంప్లెక్స్  నిర్మాణాలు చేపట్టేందుకు జనం జంకుతున్నారు. 

కౌన్సిలర్ కనుసన్నల్లోనే..

మున్సిపాలిటీల్లో అవినీతికి కౌన్సిలర్లే కారణమంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఏ నిర్మాణం చేపట్టాలన్నా ముందు కౌన్సిలర్‌ను కలుసుకుని కాసులు ముట్టజెబితే గానీ మున్సిపాలిటీ ఆఫీసుల్లో అనుమతి పత్రాలు ఆమోదం పొందుతాయని పేర్కొంటున్నారు. లేదంటే.. కుంటి సాకులతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటారని మున్సిపాలిటీల్లో ముమ్మరంగా చర్చ జరుగుతోంది. ఒకవేళ ఎవ రైనా సాహసించి నిర్మాణం ప్రారంభించిన ఒకటీ రెండు రోజుల్లో మున్సిపల్ అధికారుల బృందం తనిఖీలతో నిర్మాణాదారులను భయభ్రాంతులకు గురిచేసి చివరకు కౌన్సిలర్ రంగప్రవేశంతోనే సమస్య సద్దుమణిగేలా పాలకవర్గాలు చక్రం తిప్పు తున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రజలను ఇరకాటంలోకి నెడుతూ అవినీతి, అక్రమాలకు పాలకులు, అధికారులు మూకుమ్మడిగా దోచుకుంటున్నట్లు జోరుగా ప్రచారం   జరుగుతోంది. 

జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీల్లో రెవెన్యూ, శానిటేషన్ సెక్షన్లలో ఇలాంటి అక్రమాలు నిత్యకృత్యంగా సాగుతున్నట్లు చెబుతున్నారు. మ్యుటేషన్లు, సెల్ఫ్ అసెస్‌మెంట్‌లో తీవ్ర అవినీతి             ఆరోపణలు ఎదుర్కొన్న ఓ రెవెన్యూ అధికారిని సరెండర్ చేయాలని కొందరు కౌన్సి లర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా ఆపేందుకు అధికమొత్తం ఆఫర్ చేసినట్లు తెలిసింది. శానిటేషన్ విభాగంలో డీజిల్, వాహనాల మరమ్మతుల పేరిట అక్రమాలు, సిబ్బంది హాజరులో అవకతకవలు  మొత్తంగా మున్సిపాలిటీల్లో మనీ  పాలిటిక్స్ రాజ్యమేలుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.