22 June, 2026 | 1:37 AM

ఈఎంఐలకు రెక్కలు

16-06-2024 12:41 AM

మీ గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై నెలసరి వాయిదాలు (ఈఎంఐలు) పెరగనున్నాయి. తాజాగా ఎస్బీఐతో సహా ఆరు బ్యాంక్‌లు రుణ వడ్డీ రేట్లను పెంచాయి. రిజర్వ్‌బ్యాంక్ గతవారపు ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా అట్టిపెట్టినప్పటికీ, తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్‌ఆర్)ను అన్ని కాలపరిమితులకూ 10 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచింది. బ్యాంక్ ఇచ్చే ఏ రుణాలకైనా ఎంసీఎల్‌ఆర్ కంటే తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేయదు. జూన్ 15 ఈ శనివారం నుంచే ఎంసీఎల్‌ఆర్ పెంపు వర్తిస్తుంది. ఎస్బీఐ వెబ్‌సైట్‌లో పొందుపర్చిన సవరణల ప్రకారం ఏడాది కాలపరిమితి ఎంసీఎల్‌ఆర్ 8.65 శాతం నుంచి 8.75 శాతానికి, రెండేండ్ల కాలపరిమితి ఎంసీఎల్‌ఆర్ 8.75 శాతం నుంచి 8.85 శాతానికి, మూడేండ్ల కాలపరిమితిగల ఎంసీఎల్‌ఆర్ 8.85 శాతం నుంచి 8.95 శాతానికి పెరుగుతుంది. ఎస్బీఐ ఇచ్చే పలు రుణాలు ఎంసీఎల్‌ఆర్‌తోనే అనుసంధానమై ఉంటాయి. తక్కువ కాలపరిమితులపై సైతం స్టేట్ బ్యాంక్ తన ఎంసీఎల్‌ఆర్‌ను పెంచింది. నెలరోజుల నుంచి మూడు నెలల కాలపరిమితుల ఎంసీఎల్‌ఆర్‌ను 8.20 శాతం నుంచి 8.30 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌ను 8.45 శాతం నుంచి 8.55 శాతానికి చేర్చింది.

ఎంసీఎల్‌ఆర్ అంటే...

రుణాలపై కనీసంగా బ్యాంక్‌లు తీసుకునే వడ్డీ రేటును నిర్ణయించేందుకు మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్‌ఆర్)ను బెంచ్‌మార్క్ రేటుగా ఉపయోగిస్తాయి. అంటే బ్యాంక్‌లు రుణాలివ్వడానికి సమీకరించే నిధుల వ్యయం ఆధారంగా నిర్ణయించేదే ఎంసీఎల్‌ఆర్. అంటే డిపాజిట్లు, ఇతర రుణ సమీకరణ సాధానాలకు బ్యాంక్‌లు చెల్లించే వడ్డీ రేటుకు వాటి నిర్వహణా ఖర్చుల్ని, లాభాల మార్జిన్లను కలుపుకుని ఎంసీఎల్‌ఆర్‌ను లెక్కగడతాయన్న మాట. బ్యాంక్‌లు సమాయనుగుణంగా ఈ అంశాలన్నింటినీ సమీక్షించుకుని, అందుకుతగ్గట్టు ఎంసీఎల్‌ఆర్‌లో మార్పులు చేస్తుంటాయి. ఈ కారణంగా ఖాతాదారులకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు మారి, నెలసరి వాయిదాలు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. కానీ కొద్ది ఏండ్లుగా ఈఎంఐలు పెరుగుతూనే పోతున్నాయి. గృహ, వాహన, వ్యక్తిగత రుణగ్రహీతలకు భారంగా పరిణమిస్తున్నాయి.

ఏ రుణాలకు దేనితో లింకు?

ఎస్బీఐ ఆటోమొబైల్ రుణాలు ఒక ఏడాది ఎంసీఎల్‌ఆర్‌తో అనుసంధానమై ఉంటుంది. వ్యక్తిగత రుణాలు రెండేండ్ల ఎంసీఎల్‌ఆర్‌తో లింకై ఉంటుంది. గృహ రుణాలపై వడ్డీ రేటును సాధారణంగా ఎంసీఎల్‌ఆర్‌తో కాకుండా ఈబీఎల్‌ఆర్ ఆధారంగా నిర్ణయిస్తారు. అయితే ఈ ఎంసీఎల్‌ఆర్ అనేది కనీసంగా వసూలు చేసే వడ్డీ రేటు మాత్రమే. అంతకంటే ఎక్కువే రేటు ఉంటుంది తప్ప తక్కువ ఉండదు.  ఖాతాదారు తీసుకునే రుణాన్ని బట్టి వడ్డీ రేట్లలో మార్పులుంటాయి. గృహ రుణాలపై దాదాపు కనీస వడ్డీ రేటు ఉంటుంది. ఆటో రుణాలపై అంతకంటే ఎక్కువగానూ, వ్యక్తిగత రుణాలపై మరింత అధికంగానూ వడ్డీ రేటు ఉంటుంది.   సిబిల్ స్కోరు, ఆదాయ వనరులు, సమర్పించే సెక్యూరిటీలు తదితరాల ఆధారంగా కూడా బ్యాంక్‌లు వసూలు చేసే వడ్డీ రేట్లలో మార్పులుంటాయి. 

గృహ రుణాలపై వడ్డీ రేటు పెరుగుతుందా?

ఎస్‌బీఐ తన ఎక్స్‌న్రల్ బేస్డ్ లెండింగ్ రేటు (ఈబీఎల్‌ఆర్)ను యథాతథంగా 9.15 శాతం వద్ద అట్టిపెట్టింది. ఆర్బీఐ రెపో రేటు (6.50 శాతం)+స్ప్రెడ్ (2.65 శాతం)తో నిర్ణయించేదే ఈబీఎల్‌ఆర్. గృహ రుణాలన్నింటినీ ఈబీఎల్‌ఆర్‌తో అనుసంధానించి ఇస్తుంది. కానీ ఈబీఎల్‌ఆర్‌కంటే తక్కువ రేటుకు సైతం బ్యాంక్ గృహ రుణాల్ని ఇచ్చుకోవచ్చు. కానీ ఆ రేటు ఎంసీఎల్‌ఆర్‌కంటే తగ్గకూడదు. సిబిల్ స్కోర్ ఎస్బీఐ గృహ రుణాల్ని ప్రస్తుతం 8.50 శాతం నుంచి 9.65 శాతం మేర వడ్డీతో ఇస్తున్నది. తాజాగా ఎంసీఎల్‌ఆర్ సవరణతో గృహ రుణాల కనీస వడ్డీ రేటులో మార్పు ఉంటుంది. 

ఈ జూన్ నెలలో ఎస్బీఐతో పాటు ఇప్పటివరకూ ఆరు బ్యాంక్‌లు వాటి ఎంసీఎల్‌ఆర్‌ను సవరించాయి.

యెస్ బ్యాంక్ లెండింగ్ రేట్లు: ఈ ఏడాది జూన్ 1 నుంచి వర్తించేలా యెస్ బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్‌ను సవరించింది. ఈ బ్యాంక్ ఓవర్‌నైట్ రేటు 9.25 శాతంకాగా, నెలరోజుల ఎంసీఎల్‌ఆర్ ఆధారిత లెండింగ్ రేటు 9.55 శాతంగా ఉన్నది. మూడు నెలల రేటును 10.20 శాతం, ఆరు నెలల రేటును 10.45 శాతం చొప్పున నిర్ణయించింది. ఒక ఏడాది ఎంసీఎల్‌ఆర్ 10.60 శాతం మేర ఉన్నది.

కెనరా బ్యాంక్ రుణ రేట్లు: ఈ బ్యాంక్ ఓవర్‌నైట్ ఎంసీఎల్‌ఆర్ 8.15 శాతం. ఒక నెల రేటు 8.25 శాతం, మూడు నెలల రేటు 8.35 శాతం, ఆరు నెలల రేటు 8.70 శాతం, ఒక ఏడాది రేటు 8.90 శాతం, రెండేండ్ల రేటు 9.20 శాతం, మూడేండ్ల రేటు 9.30 శాతంగా ఉన్నాయి. సవరించిన రేట్లు జూన్ 12 నుంచి వర్తిస్తున్నాయి.

పీఎన్‌బీ లెండింగ్ రేట్లు: పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెబ్‌సైట్‌లో పొందుపర్చిన సమాచారం ప్రకారం ఓవర్‌నైట్ ఎంసీఎల్‌ఆర్ 8.25 శాతంగా ఉన్నది. నెలరోజుల ఎంసీఎల్‌ఆర్ 8.30 శాతం, మూడు నెలల రేటు 8.50 శాతం, ఒక ఏడాది రేటు 8.85 శాతం, మూడేండ్ల కాలపరిమితిగల ఎంసీఎల్‌ఆర్ 9.10 శాతం చొప్పున ఉన్నాయి. 2024 జూన్ 1 నుంచి ఈ రేట్లు అమలులోకి వస్తాయి.

ఐడీబీఐ బ్యాంక్ రుణ రేట్లు: ఐడిబీఐ బ్యాంక్ వెబ్‌సైట్‌లో ఉంచిన సమాచారం మేరకు ఓవర్‌నైట్ ఎంసీఎల్‌ఆర్ 8.35 శాతంగా ఉన్నది. నెలకాలపరిమితిగల ఎంసీఎల్‌ఆర్ ప్రస్తుతం 8.50 శాతం మేర ఉండగా, మూడు నెలల ఎంసీఎల్‌ఆర్ 8.80 శాతం, ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్ 9 శాతం వద్ద ఉన్నది. వినియోగరుణాల్ని చాలావరకూ బ్యాంక్‌లు లింక్ చేసే ఒక ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ను  9.05 శాతంగా నిలిపిఉంచింది. రెండు, మూడేండ్ల ఎంసీఎల్‌ఆర్‌లు 9.60 శాతం, 10 శాతం వద్ద ఉన్నాయి. ఈ రేట్లు 2004 జూన్ 12 నుంచి అమలులోకి వచ్చాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రుణ రేట్లు: ఈ బ్యాంక్ ఓవర్‌నైట్ ఎంసీఎల్‌ఆర్ 8.95 శాతంగా ఉన్నది. నెలకాలపరిమితిగల ఎంసీఎల్‌ఆర్ ప్రస్తుతం 9 శాతం మేర ఉండగా, మూడు నెలల ఎంసీఎల్‌ఆర్ 9.15 శాతం, ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్ 9.30 శాతం వద్ద ఉన్నది. వినియోగరుణాల్ని చాలావరకూ బ్యాంక్‌లు లింక్ చేసే ఒక ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 9.30 శాతానికి పెంచింది. రెండు, మూడేండ్ల ఎంసీఎల్‌ఆర్‌ను 9.35 శాతం వద్ద అట్టిపెట్టింది. ఈ రేట్లు 2004 జూన్ 7 నుంచి అమలులోకి వచ్చాయి.