calender_icon.png 12 September, 2024 | 11:35 PM

సీఎంఆర్‌కు మరో 100 రోజులు

06-07-2024 01:18:52 AM

గడువు మరోసారి పొడిగించిన ప్రభుత్వం 

గతంలో జూన్ వరకు గడువిచ్చినా స్పందించని మిల్లర్లు

ధాన్యం తీసుకున్న మిల్లర్లతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం

గడువులోగా ఇవ్వకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక

కామారెడ్డి జిల్లాలో రూ.100 కోట్ల విలువైన బియ్యం బకాయి

కామారెడ్డి, జూలై 5 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో సీఎంఆర్ బియ్యం సరఫరా చేసేందుకు మిల్లర్లకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. గతం లో జూన్ 30 వరకు గడువు విధించినా ధాన్యం మెక్కిన మిల్లర్లు స్పందించలేదు.  మరో మూడునెలల గడువిస్తే  బకాయిపడ్డ సీఎంఆర్ బియ్యాన్ని అప్పగిస్తామని ప్రభుత్వ పెద్దలకు హమీ ఇవ్వడంతో మరో వందరోజుల గడువిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

శుక్రవారం కామా రెడ్డి కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్  పౌరసరఫరాలశాఖ అధికారులు సీఎంఆర్ బకాయి పడ్డ మిల్లర్లు, ప్రస్తు సీజన్‌లో ధాన్యం తీసుకున్న మిల్లర్లతో సమావేశమయ్యారు. సీఎంఆర్ బియ్యాన్ని అప్పగించకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో బకాయిపడ్డ బియ్యాన్ని రికవరీ చేస్తామని, లేదంటే మిల్లర్ల ఆస్తులను ప్రభుత్వానికి అటాచ్ చేస్తామని తేల్చి చెప్పారు. దీంతో బకాయి సీఎంఆర్ చెల్లించేందుకు మూడు నెలలు గడువు కావాలని మిల్లర్లు కోరారు. వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొన్న కలెక్టర్.. చివరి దఫాగా మరో వందరోజులు గడువు ఇస్తున్నట్టు ప్రకటించారు.

రూ.౧౦౦ కోట్ల బియ్యం

కామారెడ్డి జిల్లాలో 36 మంది మిల్లర్లు ప్రభుత్వానికి దాదాపు రూ.౧౦౦ కొట్ల విలువైన సీఎంఆర్ బియ్యం అప్పగించాల్సి ఉంది.   గడువులోపు బిచ్కుందకు చెందిన ఒక మిల్లర్ ప్రభుత్వానికి అప్పగించారు. మిగిలిన ౩౫ మంది స్పందించలేదు. బియ్యం ఇవ్వని మిల్లర్ల ఆస్తులను ఆర్‌ఆర్ యాక్ట్ కింద అటాచ్ చేసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించగా మిల్లర్లకు జమానత్‌గా ఉన్న వారి ఆస్తులను కూడా ఆటాచ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు.