calender_icon.png 14 August, 2025 | 10:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉదయత్వం

04-08-2025 12:00:00 AM

ఉదయం బంగారు తీగల కిరణాలు

అదృశ్య సూదుల్లా ప్రసరిస్తుంది

రవిబింబం తేజస్సుతో కప్పబడిన

యోగిలా నిశ్చలంగా మననే

చూస్తుంటుంది

మనసుకా చూపు మరో జన్మనిస్తుంది

రాత్రంతా మొగ్గలా నిదురించి

ఉదయాన్నే విచ్చుకొని హత్తుకొనే

దివ్య కరచాలనమది

ఆ స్పర్సే ప్రాణికోటికి పునరుత్తేజం

రాత్రంతా ఒడ్డుతో పోరాడి విరిగిన

అలలు ఉదయం మళ్ళీ పోరాటం

ఆరంభించినట్టే

సూర్యుడు రోజూ పూస్తూనే ఉంటాడు

రోజూ రాలి పడతాడు

తాజాదనం మాత్రం ఎప్పుడూ తగ్గదు!

లేలేత పూవంటి కిరణాలు సృష్టిని

మన మనోదృష్టిని నవీకరిస్తుంటాయ్!

సూరీడు కళ్లు తెర్చే ప్రతి ఉదయం

కొత్త సృష్టి పుట్టినట్టే..

ప్రతి అస్తమయం రేపటి ఉదయానికి

విత్తనంలా భూమిలో నాటుకొన్నట్టే!