04-08-2025 12:00:00 AM
మచ్చ ప్రభాకర్ తెలుగు సాహి త్య రంగంలో కవిగా, రచయితగా, అనువాదకుడిగా, ఉద్యమకారుడిగా తన దైన ముద్ర వేశారు. తొలితరం బహుజన ఉద్యమాల్లో కీలకమైన వ్యక్తి పనిచేశారు. ఫూలే, అంబేద్కర్ రచనలను తెలుగులోకి అనువదించి బహుజన ఉద్యమాలకు పునాది వేశారు. ప్రభాకర్ రాజన్న సిరిసిల్ల జిల్లా పోతుగల్ గ్రామంలో 1952 ఆగస్టు 2న జన్మించారు. ప్రభాకర్ పద్మశాలి కుటుంబంలో జన్మించారు.
ప్రభాకర్‌కు చిన్ననాటి నుంచే ఉద్యమాలపై ఆసక్తి ఉండేది. హైస్కూల్ స్థాయిలోనే తెలంగాణ తొలి దశ ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. అనేక ప్రజా సంఘాల్లో సభ్యుడిగా చేరారు. సిద్దిపేటలో ఇంటర్మీడియట్ చదివే సమయంలో అణచివేత, వెట్టిచాకిరీ నిర్మూలనపై ఉద్యమించారు. హైదరాబాద్‌లోని అడిక్‌మేట్ కళాశాలలో డిగ్రీ చదివే సమయంలో ఆయన ‘విరసం’ సభ్యుడిగా చేరారు.
ప్రసిద్ధ కవి వరవరరావుతో కలిసి పనిచేశారు. ఎమర్జెన్సీ నిర్బంధకా లంలో కొన్నాళ్లు ఆయన అహ్మద్‌నగర్ తలదాచుకోవాల్సి వచ్చింది. అక్కడ తన కులవృత్తి చేనేత వృత్తి చేస్తూ జీవనం సాగించారు. 1977లో ముంబైలో ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు పాఠాలు బోధించారు. తర్వాత, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ‘కార్మిక వర్గ మిత్ర మండ లి‘ అనే సంస్థను స్థాపించారు. కార్మికుల హక్కుల కోసం పోరాటం సాగిం చారు.
ఒక పక్ష పత్రిక ద్వారా కార్మికుల గొంతుకగా నిలిచారు. కొన్నాళ్లకు సీపీఐలో చేరి అనేక ఉద్యమాలకు ప్రాతినిధ్యం వహించారు. అనతికాలంలోనే ఆర్గనైజర్‌గా నియమితుడయ్యారు. కార్మికుల గొంతుక వినిపించేందుకు ఒక పక్ష పత్రికను స్థాపించారు.
మరాఠి పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు. ఆయన స్వయంగా కార్మిక జీవితాలను దగ్గర నుంచి చూశారు. తెలంగాణ నుంచి వలస వచ్చిన కార్మికులకు ఆయన ప్రత్యేకంగా రాజకీయ తరగతులు నిర్వహించేవారు. దేశవ్యాప్తంగా విప్లవోద్యమాలు జరుగుతున్న సమయం లో ఆయన విస్తృతంగా బుద్ధుని పుస్తకాలను చదవడం ప్రారంభించారు. బుద్ధుడి బోధనలకు ప్రభావితుడయ్యాడు.
ఫూలే, అంబేద్కర్ స్ఫూర్తితో..
వామపక్ష ఉద్యమాల్లో పనిచేస్తున్న కాలంలోనే ప్రభాకర్‌పై జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్ రచనల ప్రభావం పడింది. దీంతో ఆయన క్రమంగా దళిత-బహుజన ఉద్యమాల వైపు మళ్లారు. రచయితగా ఫూలే, అంబేద్కర్ రచనలను తెలుగులోకి తర్జుమా చేశారు. తద్వారా తెలుగు పాఠకులకు ఫూలే, అంబేద్కర్ రచనలను దగ్గర చేసినట్లయింది. ‘నడక’, ‘రాజకీయ పెళ్లి’, ‘మూడు అడుగుల యుద్ధం’
వంటి కవిత్వ సంపుటాలు నాడు బహుజన ఉద్యమాలకు దీపికలుగా నిలిచాయి. ప్రభాకర్ సాహిత్య వ్యాసాలు కూడా రాశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ముంబై కేంద్రంగా తెలంగాణ ధూంధాం వంటి సభల్ని నిర్వహించి, ఆ జ్వాలను మహారాష్ట్రకు కూడా విస్తరించారు. ప్రజల సంస్కృతి, భాషపై ప్రభాకర్‌కున్న మమకారాన్ని చూస్తే, నిజమైన ప్రజాకవికి ఎలా లక్షణాలు ఉండాలో అర్థమవుతుంది.
రచనలు..
మచ్చ ప్రభాకర్ రచనలు నడక (కవిత్వం), రాజకీయ పెళ్లి (దీర్ఘ కవిత), నడుస్తున్న చరిత్ర (సాహిత్య వ్యాసాలు), శంభుకుడు, కర్ణుడు అంబేద్కర్ వ్యాసావళి, మూడు అడుగుల యుద్ధం (కవిత్వం), ముంబై నిర్మాణంలో తెలుగు ప్రజల పాత్ర (మనోహర్ కదం రచన అనువాదం), మేం చూసిన పూలే (మరాఠీ నుంచి అనువాదం), రామయ్య వెంకయ్య అయ్యవారు (అపూర్వ జీవిత చరిత్ర అనువాదం) ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి.
జీవితకాలం ప్రజా చైతన్యానికి అంకితమై పనిచేస్తున్న ప్రభాకర్ ఉద్యమాల్లో కొనసాగుతున్న క్రమంలో 2014లో ఆయన జీవన సహచరి గుండెపోటుతో మృతిచెందారు. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేని ప్రభాకర్ కుంగిపోయారు. ఒంటరితనంతో చితికిపోయారు. 2018 జనవరి 23న ముంబైలో ఆయన ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రభాకర్ జీవితం ఒక తెరిచిన పుస్తకం. బతికనంత కాలం పీడిత ప్రజల విముక్తి కోసమే పోరాడారు. మచ్చలేని జీవితాన్ని గడిపారు. ఆయన పోరాటం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది.