06-01-2026 12:00:00 AM
ఎల్బీనగర్, జనవరి 5: నల్గొండ---రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం (నార్మూల్, మదర్ డెయిరీ) పాలక వర్గం డైరెక్టర్లు చైర్మన్ మధుసూదన్ రెడ్డిపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం సోమవారం వాయిదా పడింది. డైరెక్టర్లు సమయం కావాలని కోరడంతో, ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడంతో తీర్మానం వాయిదా పడినట్లు సమాచారం.
చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి ముందే రాజీనామా చేయాలని, లేకుంటే అవిశ్వాస తీర్మానం ఎదుర్కొవాలని ఇటీవల 11 మంది డైరెక్టర్లు మదర్ డైయిరీ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకు లేఖ అందజేశారు. దీంతో సోమవారం చేపట్టాల్సిన అవిశ్వాస తీర్మానం వాయిదా పడింది. చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, డైరెక్టర్లతో సంప్రదించడం లేదని, మదర్ డైయిరీ సంస్థను కాపాడటానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గతంలో ఆరోపించారు.
తీర్మానం వాయిదా పడడంపై డైరెక్టర్ల ఆందోళన
అవిశ్వాస తీర్మానం ఉందని బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన డైరెక్టర్లు సోమవారం హయత్ నగర్‌లోని మదర్ డైయిరీకి వచ్చారు. అవిశ్వా స తీర్మానం వాయిదా పడినట్లు సమాచారం రావడంతో డైరెక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మదర్ డైయిరీ గేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు పాండు, లక్ష్మా రెడ్డి, శ్రీకర్‌రెడ్డి, పాల ఉత్పత్తిదారుల సంఘాల చైర్మన్లు మాట్లాడారు.
రైతులకు పెండింగ్ లో ఉన్న పాల బిల్లులు చెల్లించాలని, ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. డైయిరీని నష్టాలపాలు చేసిన చైర్మన్ మధుసూదన్ రెడ్డి రాజీనామా చేయాలని నినాదా లు చేశారు. ప్రస్తుతం రూ.24 కోట్లు అవసరమని, 9 బిల్లులు పెండింగ్ ఉన్నాయని తెలి పారు. మదర్ డైయిరీ నష్టాలతో ఉండడానికి ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య కారణమని మదర్ డైయిరీని అమ్మడానికి కాంగ్రెస్ ప్రభు త్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు.