06-01-2026 12:00:00 AM
యూరియా సరఫరా పట్ల రైతులలో ఏ.ఈ.ఓలు భరోసా కల్పించాలి
యూరియా సరఫరా, యాసంగికి సాగు నీటి సరఫరాపై అధికారులతో సమీక్షలో కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, జనవరి- 5(విజయక్రాంతి) జిల్లాలో చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో యూరియా సరఫరా, యాసంగికు సాగు నీటి సరఫరా పై సంబంధిత అధికారులతో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 8,2026 వరకు 7 తడులలో యాసంగి పంటకు ఎస్సారెస్పీ నుంచి సాగునీరు విడుదల అవుతుందని, 7 రోజుల పాటు జగిత్యాల జిల్లాకు, 8 రోజుల పాటు పెద్దపెల్లి జిల్లాకు సాగు నీరు అందుబాటులో ఉంటుందని అన్నారు.
ఎస్సారెస్పీ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీరు అందుబాటులో ఉందని, నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటూ చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందేలా చూడాలని, ఇతర జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటూ పని చేయాలని, ఎక్కడ నీటి వృధా ఉండడానికి వీలు లేదన్నారు. ఆఖరి తడులలో సాగునీటి ఇబ్బందులు రాకుండా ముందుగానే ప్రణాళిక బద్దంగా పని చేయాలని, సాగు నీటి విడుదల గురించి రైతులకు ఎప్పటి కప్పుడు వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా సమాచారం అందించా లన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా దృష్టి సారించేలా వ్యవసాయ అధికారులు కృషి చేయాలని సూచించారు.
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సాగునీటికి ఎక్కడ రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. డీ-83, డీ-86 కాలువలలో ఎక్కడైనా అవసరమైన చిన్న చిన్న మరమ్మత్తులు అవసరం ఉంటే వెంటనే చేపట్టాలని కలెక్టర్ సూచించారు. సాగునీటి కాలువల నుంచి నీటి డైవర్షన్ చేయడానికి వీలు లేదని, ఎటువంటి ఒత్తిడి వచ్చిన సాగు నీరు సరిగ్గా వెళ్ళేలా చూడాలన్నారు. ప్రతి రైతుకు సమృద్ధిగా యూరి యా అందుబాటులో ఉందని, స్టాక్ లో ఎటువంటి కొరత లేనందున రైతులందరికీ యూరియా పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
రాబోయే 10 రోజులకు మించి అవసరమైన స్టాక్ అందుబాటులో ఉందని, రైతులు ఎవరు ఆందోళన చెందకుండా వారిలో భరోసా కల్పించాలని కలెక్టర్ వ్యవసాయ విస్తరణ అధికారులను ఆదేశించారు. ప్రతి వ్యవసాయ సహకార సంఘం, ప్రైవేట్ డీలర్ వద్ద ఉన్న యూరియా స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, యూరి యా స్టాక్ ఎక్కడ అందుబాటులో ఉంది అనే అంశం రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అన్నారు. రైతులతో వ్యవసాయ అధికారులు నేరుగా సంప్రదింపులు జరపాలని, ప్రస్తుత స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ అపోహలను తొలగించాలన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా పోలీసుల అవసరం రాకుండా యూరియా పంపిణీ చేయాలని కలెక్టర్ వ్యవసాయ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్, నీటిపారుద ల శాఖ డివిజనల్ ఇంజనీర్ కే. శ్రీనివాస్ సంబంధిత అధికారులు ల్గొన్నారు.