26-07-2025 07:17:30 PM
అపన్న హస్తం కోసం ఎదురుచూపులు..
ప్రభుత్వం చొరవ చూపాలని భర్త జంపన్న విజ్ఞప్తి...
కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం జిల్లా కేంద్రం లోని రైటర్ బస్తి ఏరియాలో పేద కుటుంబానికి చెందిన,దళిత మహిళా జాడి మంజుల గత కొంత కాలంగా గుండె, లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. మంజుల చిన్న తనంలోనే చాలా చురుకుగా విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తూ ఉండేది. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి, అయిన వారు అందరూ ఉన్నా, విద్యార్థి సంఘం పిడిఎస్యులో పనిచేసి, పిఓడబ్ల్యు మహిళా సంఘంలో పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని తనదైన ముద్ర వేసి విద్యా సంస్థలో ఏ సమస్యలున్నా, న్యాయం జరిగే వరకు పోరాటాలు సాగించేది.
విద్యార్థుల పట్ల మానవతా దృక్పథం కలిగిన వ్యక్తిత్వం ఆమెది. జిల్లాలోని విద్యాసంస్థ లకు సుపరిచితురాలు, తెలంగాణ ఉద్యమ సమయంలో, తెలంగాణ ధూమ్ ధామ్, జానపద కళాకారుడు, విద్యార్థి, ఉద్యమ కారులు కొండ జంపన్నతో వివాహం జరిగింది. ప్రస్తుతం కొత్తగూడెంలో భర్త కొండ జంపన్న తో కలిసి జీవనం సాగిస్తున్నారు. జంపన్న జర్నలిస్ట్ గా కొత్తగూడెం లో విధులు నిర్వహిస్తున్నారు. మంజులకు, బాబు పుట్టిన తర్వాత ఈ సమస్య మొదలైంది. భర్త జంపన్న, తోబుట్టువులు, కలిసి చేతనైన వైద్యం చేయిస్తున్నారు.
వైద్య ఖర్చులు, మందులు భారం అవుతుండడంతో స్తోమత లేక అపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. పలువురి అధికారుల సహాయ సహకారంతో, హైదరాబాద్ లో ఉన్న మహావీర్ హాస్పిటల్ లో వైద్యం అందిస్తున్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం దాతలు ఎవరైనా ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు. సాయం చేయదలచిన వారు ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ కొండా జంపన్న-మంజుల 9640542268,కి పంపించాలని విజ్ఞప్తి చేశారు.