26-07-2025 07:15:29 PM
ఇల్లందు టౌన్ (విజయక్రాంతి): ఖర్చుతో కూడుకున్న వైద్యం ఇల్లందు ప్రభుత్వాసుపత్రి(Yellandu Government Hospital)లో ఆరోగ్యశ్రీ పద్ధతిలో ఉచితంగా అందించారు. పట్టణంలోని స్థానిక రైటర్ బస్తికి చెందిన ఖ్యాతికి(18) ముక్కులో దూలం పెరిగి ఊపిరాడక ఇబ్బంది పడటంతో ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించగా దాదాపు రూ.40వేలు పైగా ఖర్చు అవుతుందని అక్కడి డాక్టర్లు తెలిపారు.
ఆర్థిక స్తోమత లేని ఖ్యాతి ఇల్లందు ప్రభుత్వాసుపత్రికి వైద్యం కోసం వెళ్ళగా ఈఎన్టి వైద్యులు రవి, తేజశ్రీ ఆధ్వర్యంలో రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ పద్ధతిలో సర్జరీ చేసి వంకర పోయిన ముక్కు దూలం సరిచేసి పెరిగిన కండరాలను తొలగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ హర్షవర్ధన్ మాట్లాడుతూ, ప్రజలు వేలు, లక్షలు వెచ్చించి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదని మెరుగైన ఉచిత వైద్యాన్ని ప్రభుత్వాసుపత్రిలో వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపర్డెంట్ ఫర్జానా, హెడ్ నర్స్ భారతి, నర్సింగ్ ఆఫీసర్ లలిత తదితరులు పాల్గొన్నారు.