20-04-2025 12:00:00 AM
ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన ఉద్యమంలో తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఏదో ఒక చౌరస్తా ఉద్యమానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచేది. ఇదే క్రమంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సైతం ఉద్యమానికి అడ్డగా మారింది. అప్పటివరకు ఎన్టీఆర్ చౌక్‌గా పిలుచుకున్న చౌరస్తాకు స్వరాష్ట్ర సాధన ఉద్యమానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలవడంతో ఆ కూడలికి తెలంగాణ తల్లి చౌరస్తాగా పేరు మార్చారు. అంతటితో ఆగని తెలంగాణ ఉద్యమకారులు శాశతంగా ఆ చౌరస్తాకు ఆ పేరు నిలిచిపోవాలని రూపాయి రూపాయి పోగుచేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పారు. అప్పటి నుంచి ఆ చౌక్ తెలంగాణ తల్లి చౌరస్తాగా మారిపోయింది.
ప్రత్యేక రాష్ర్ట సాధన కోసం నాడు సీమాంధ్రులకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలోని ఈ చౌరస్తానే పోరాటానికి నాంది పలికింది. ఆదిలాబాద్ పాత, కొత్త పట్టణానికి నడిబొడ్డున ఉండటంతోపాటు జాతీయ రహదారి కావడంతో ఉద్యమకారులు చౌరస్తాకు వచ్చి ఉద్యమకార్యచరణ మొదలుపెట్టేది. దీంతో జిల్లాలోని ఏ ప్రాంతం నుంచైనా వచ్చే ఉద్యమకారులు ఆ చౌరస్తాకు వచ్చి నిరసన వ్యక్తం చేసేవారు.
విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రొఫెసర్ కోదండరాం
మొదటగా ఆదిలాబాద్ చౌరస్తాలో ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహం ఉండేది. అయితే, ఉద్యమం రోజురోజుకూ ఎగిసిపడటంతో ఉద్యమకా రులందరూ ఆ చౌరస్తాకు ఆంధ్ర నాయకుని పేరు ఎందుకు? అంటూ అదే చౌరస్తాలో ఓ వైపు తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పారు.
22 జూన్ 2012లో తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆవిష్కరించారు. దీంతో అప్పటివరకు ఎన్టీఆర్ చౌక్‌గా పిలవబడే ఆ చౌరస్తాకు తెలంగాణ తల్లి చౌరస్తాగా నామకరణం చేశారు.
విగ్రహన్ని ప్రతిష్టించాలి..
ప్రస్తుతం అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం లేకపోవడంతో చౌరస్తా కాస్త బోసిపోయి కనిపిస్తోంది. స్వరాష్ర్టం ఏర్పడ్డాక అభివృద్ధి పనుల్లో భాగంగా చౌరస్తాలో ఉన్న ఎన్టీఆర్, తెలంగాణ తల్లి విగ్రహాలను తొలగించి రోడ్డు వెడల్పు, చౌరస్తా పునరుద్ధరణ, డివైడర్లను ఏర్పాటు చేశారు. అయితే చౌరస్తా మధ్యలో భారీ వాటర్‌ఫౌంటెన్‌ను నిర్మించారు.
అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేతల డిమాండ్ మేరకు మళ్లీ ఎన్టీఆర్ విగ్రహాన్ని చౌరస్తాలో ఓ వైపు పున:ప్రతిష్టించారు. కానీ, తొలగించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రం ప్రతిష్ఠించలేదు. తెలంగాణ తల్లి చౌరస్తాగా పిలవబడిన చౌరస్తా.. మళ్లీ ఎన్టీఆర్ చౌక్‌గా మరే ప్రమాదం ఉందని ఉద్యమకారులు ఆవేదన చెందుతున్నారు.