calender_icon.png 4 May, 2025 | 8:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూట గడవటమే కష్టంగా మారింది!

20-04-2025 12:00:00 AM

తెలంగాణ మలిదశ ఉద్యమంలో అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా తూర్పు అటవీ ప్రాంతమైన కాటారం (ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లా) మండలంలో ఉవ్వెత్తున ఎగిసిపడిన ఉద్యమానికి ఊపిరిలూదాడు జావిద్‌ఖాన్. పిట్ట కొంచెం కూత ఘనం అన్న చందంగా బక్కచిక్కిన దేహంతో కనబడినా కథనరంగంలో ముందుండి దూసుకుపోయే తత్వం ఆయనది. తెలంగాణ ఉద్యమకారులు, మేధావుల పిలుపు మేరకు ప్రతి కార్యక్రమంలో పాల్గొనేది.

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న మలిదశ తెలంగాణ ఉద్యమంలో ముందు ఉండి ఉద్యమాన్ని నడిపించారు. 2010 సంవత్సరంలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు పిలుపు మేరకు పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని ఉద్యమ పథంలో నడిచాడు. అట్టడుగు వర్గాల నుంచి అణగారిన జనాన్ని సమీకరించి వంటావార్పు కార్యక్రమాలతో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశారు.

ఆయన అడుగుజాడల్లో ఉద్యమకారులు ముందుకు కదిలారు. మండలంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర నాయకత్వం ఎలాంటి పిలుపు ఇచ్చిన దానికి స్పందిస్తూ.. అందుకు అనుగుణంగా కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పూర్తి చేసేవాడు. ఆనాటి పోరాట పటిమను నేటికీ విడిచిపెట్టలేదు. 

జ్ఞాపకాలే మిగిలాయి..

నాడు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత, బాల్క సుమన్, పుట్ట మధు తదితరుల సారథ్యంలో జావిద్‌ఖాన్ ఉద్యమించారు. తెలంగాణ పోరుబాటలో ముందున్నప్పటికీ స్వరాష్ట్రంలో అవన్నీ జ్ఞాపకాలుగా మిగిలాయి. ఇప్పుడు పూట గడవడమే కష్టంగా మారింది. అప్పట్లో మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడిగా అవకాశం కల్పించినప్పటికీ ప్రయోజనం చేకూరలేదని ఆవేదన వ్యక్తంచేశారు.

కొంతమంది రాజకీయ అవసరాల కోసం ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగారు. మరికొంతమంది ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తులు మధ్యలో పుట్టుకొచ్చి అందలం ఎక్కిన తీరు చూస్తే బాధగా అనిపిస్తుంది. జావీద్‌ఖాన్‌లాంటి ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఉద్యమసహచరులు, కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.