01-10-2025 10:48:03 PM
హనుమకొండ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం వరంగల్ జిల్లాకు మంజూరైన సిజిఈహెచ్ఎస్ వెల్ నెస్ సెంటర్ భవనం కోసం పలు ప్రభుత్వ కార్యాలయాలను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ బుధవారం పరిశీలించారు. ముందుగా హనుమకొండలోని కూడా కార్యాలయంలోని భవనాలను పరిశీలించి వాటి వివరాలను ఎంపీ డాక్టర్ కడియం కావ్య, కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేయూ క్రాస్ రోడ్డు సమీపంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్ భవనాన్ని పరిశీలించారు. అదేవిధంగా కాజీపేటలోని మున్సిపల్ కార్యాలయంలోని గదులను ఎంపీ, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ పరిశీలించి డిప్యూటీ కమిషనర్ రవీందర్ ను మున్సిపల్ కార్యాలయంలోని ఖాళీగా ఉన్న వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
వరంగల్ ఆటోనగర్ సమీపంలోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలోని గదులను పరిశీలించి వాటిని గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వైద్య సేవలను అందించేందుకు సిజిఈహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు అనువైన భవనం, సదుపాయాలు, తదితర అంశాలను గురించి ఎంపీ డాక్టర్ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, హనుమకొండ వరంగల్ జిల్లాల డిఎంహెచ్వోలు డాక్టర్ అప్పయ్య, డాక్టర్ సాంబశివరావు, ఇతర అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా హనుమకొండ, కాజీపేట తహసీల్దార్లు రవీందర్ రెడ్డి, భావు సింగ్, కుడా పీవో అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.