13-01-2026 10:41:03 PM
బ్యాంకర్లు ఎంఎస్‌ఎంఈ పథకాలకు విస్తృత స్థాయిలో ప్రాధాన్యం కల్పించాలి
కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలకు కూడా విస్తృత ప్రచారం కల్పించి ప్రజలకు చేరువ చేయాలి: నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి
వనపర్తి,(విజయక్రాంతి): జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో లీడ్ బ్యాంక్ (యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో జిల్లాస్థాయి రివ్యూ కమిటీ బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లురవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆయనతోపాటు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి, దేవరకద్ర శాసనసభ్యులు జీ మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర పథకాల అమలుపై బ్యాంకుల వారీగా సమీక్షించిన ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు ఎంఎస్‌ఎంఈ పథకాలకు విస్తృత స్థాయిలో ప్రాధాన్యం కల్పించి రుణాలను మంజూరు చేయాలని పేర్కొన్నారు.
జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ జిల్లాలో బ్యాంకర్లు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని శానిటేషన్ వర్కర్ లందరికీ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద చేర్చినట్లు తెలిపారు.