భక్తిశ్రద్ధలతో మొహరం వేడుకలు
26-06-2026 12:00 AM
నాగలిగిద్ద, జూన్ 25: నాగలిగిద్ద మండలంలోని కరసుగుత్తి గ్రామంలో మొహరం పండుగ వేడుకలు గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగాయి. మండలంలోని పలు గ్రామాల్లో కూడా మొహరం సందర్భంగా పీర్లను ప్రతిష్ఠించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పీర్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, హిందూముస్లిం సోదరభావానికి ప్రతీకగా ప్రజలు కలిసి పండుగను జరుపుకున్నారు. మొహరం పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, స్థానిక అధికారులు తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా మొహరం వేడుకలు జరుపుకుంటున్నట్లు స్థానిక గ్రామ ప్రజలు తెలిపారు.






