రూ.7కోట్ల సీఎంఆర్ రైస్ కుంభకోణం!
ఇద్దరు నిందితుల అరెస్ట్
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పీఎస్ పరిధిలోత ఘటన
సుల్తానాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): ఇండస్ట్రీల పేరుతో కోట్ల రూపాయలు దండుకుంటూ తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు రైస్ మిల్ భాగస్వాములను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సుల్తానాబాద్ పోలీస్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ భూక్య రామ్‌రెడ్డి వివరాలను వెల్లడించారు.
సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి పూసల గ్రామంలోని సౌభాగ్యలక్ష్మీ రైస్ మిల్ భాగస్వాములైన బండారి మారుతి, సొక్కం అంజయ్యలు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ బియ్యాన్ని డెలివరీ చేయకుండా ఏడు కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడినట్లు డీసీపీ పేర్కొన్నారు. 2023లో 3116.360 మెట్రిక్ టన్నులు, 2024లో 2119.125 మెట్రిక్, టన్నుల బియ్యం ప్రభుత్వానికి అందించాల్సి ఉండగా కేవలం 515.558 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అందించి, మిగతా 1603.967 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని డెలివరీ చెయకుండా ఎగనామం పెట్టారన్నారు.
బ్యాంకుల వద్ద రైస్ మిల్లుల పేరుతో అప్పులు తీసుకోవడం, సివిల్ సప్లయ్ అధికారులకు తెలియకుండా ప్రభుత్వ ధాన్యాన్ని నిందితులు బహిరంగం మార్కెట్‌లో విక్రయిస్తున్నారన్నారు. గతంలో కూడా బండారి మారుతి రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఇదే తరహాలో మోసాలకు పాల్పడ్డారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిందితులు 158 కోట్ల ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించి, సివిల్ సప్లై సంస్థను, ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. సివిల్ సప్లయిస్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి దిగారు.
బండారి మారుతి, అంజయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టుతుండగా సోమవారం కరీంనగర్ కట్టరాంపూర్ జిమ్ములో ఇద్దరు నిందితులను సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు ఆధ్వర్యంలో ఎస్‌ఐలు చాక చక్యంగా పట్టుకొని సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీసీపీ రామ్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో ఏసీబీ కృష్ణ, సీఐ రంజిత్ రావు, సర్కిల్ పరిధిలోని ఎస్‌ఐలు చంద్రకుమార్, సనత్ రెడ్డి, అదనపు ఎస్‌ఐ అశోక్ రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






