ప్రభుత్వ విద్యలో విప్లవాత్మక మార్పులు
ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆర్జెడి సోమిరెడ్డి
నాగర్ కర్నూల్, జూన్ 23 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (టీపీఎస్) ఏర్పాటు కార్యక్రమాన్ని వేగవంతం చేసిందని విద్యాశాఖ రీజినల్ డైరెక్టర్ సోమిరెడ్డి అన్నారు. మంగళవారం పెద్దకొత్తపల్లి జెడ్పీహెచ్‌ఎస్ను విద్యాశాఖ, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలిసి సందర్శించి భౌతిక వసతులు, విస్తరణ అవకాశాలను పరిశీలించారు.
ఒక్కో పాఠశాలను రూ.15 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసి, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ క్లాస్రూమ్స్, ల్యాబ్లు, ఉచిత రవాణా తదితర అత్యాధునిక సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలోనే విలువలతో కూడిన విద్య అందుతుందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. వారి వెంట డిఇఓ రమేష్ కుమార్, ఇంజనీరింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.






