06-12-2025 11:09:59 PM
* ప్రజలతో పాటు.. కౌన్సిలర్లతోనూ అదే పరిస్థితి
* ఇకపై ఎం జరిగినా.. మిమ్మల్ని ఎవరూ ఇబ్బంది పెట్టరు
* ప్రజలే స్వచ్ఛంధంగా సహకరించాలి
* మీడియాకు మున్సిపల్ ఛైర్మన్ వాట్సాప్ లో ప్రకటన
అచ్చంపేట: నాకు సంబంధం లేకుండానే అందరి దృష్టిలో శత్రువునైతున్నాను. ఇకపై ఏం జరిగినా అధికారులెవరూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని కోరుతున్నా.. ప్రజలే స్వచ్ఛంధంగా తమ ఆత్మానుసారం సహకరించాలని నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపల్ ఛైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు మీడియా ద్వారా ప్రజలను కోరారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వాట్సాప్ లో సుధీర్ఘ సందేశాన్ని విలేఖరులకు పంపించి.. ఆ అంశాలు ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఆయన ప్రకటన యథాతథంగా.. ‘అచ్చంపేట ప్రజలందరికి నమస్కారం.. మీరందరూ నన్ను క్షమించాలని కోరుతున్నాను. ఎందుకంటే మున్సిపాలిటీ సిబ్బందిని ప్రజల ఆస్తి పన్ను సకాలములో వసూళు చేయమని, కొత్త అసెస్మెంట్లు చేసుకొమని, పన్ను తక్కువుంటే రివైస్ చెయ్యాలని, వ్యాపారం చేసే వాళ్లు ట్రేడ్ లైసెన్స్ తప్పకుండా తీసుకోవాలని చెప్పాను.
డబ్బులుంటే పట్టణాభివృద్ధి చెయ్యొచ్చని, నేను కూడా ఫాలో అప్ చెయ్యడం జరిగింది, కానీ దాని వల్ల మా కౌన్సిలర్లు, నాయకులు, పలుకుబడి ఉన్న పెద్దమనుషులు, సాధారణ ప్రజలందరి దృష్టిలో నేను శత్రువునైతున్నాను. వారితో నాకు ఎలాంటి వ్యక్తి గత శత్రుత్వం లేదు. అలాగే గతేడాది పన్ను వసూళు అంచనాకు తగ్గట్టు లేదు. దీంతో మన పురపాలిక అభివృద్ధి పనుల నిమిత్తం రావాల్సిన 15వ ఆర్థిక కమిషన్ నిధులు రూ. 50 లక్షలు రాలేదు. ప్రతీ రోజు రోడ్డు, డ్రైనేజీ లేదని ఎన్నో వినతులు వస్తున్నాయి. సరిపడా చెత్త సేకరణ కొరకు ఆటోలు కొందామంటే నిధులు లేవు. ఇకపై మీ మీద ఎలాంటి వత్తిడి లేకుండా, కొందరిని వదిలేసి కేవలం సాధారణ ప్రజల నుంచి కచ్చితంగా వసూలు చేస్తున్నారనే అపవాదు రాకుండా మీరే స్వచ్చందంగా, ఆత్మప్రభోదనుసారంగా చెల్లించండి. పన్ను వసూళు కోసం ఎవరి వద్దకు వెళ్లొద్దని కమిషనర్, సిబ్బందిని రిక్వెస్ట్ చేస్తున్నాను.
అలాగే ఇళ్లు, వ్యాపార భవనాలు, ఇతర నిర్మాణములు చేపడితే సెటబ్యాక్ లేవని, రోడ్ ఆక్రమించారాని మొదలైన అంశాల గురించి ఎవరైనా ఫిర్యాదు చేసినా, సిబ్బంది దృష్టికి వచ్చినా.. పట్టణ ప్రణాళిక అధికారులు వారిని హెచ్చరించడం, చర్యలకు తీసుకోవడం, నోటీసులు ఇవ్వడము చెయ్యొద్దని కూడా చెప్పడం జరుగుతది. మీరే మీ మనస్సాక్షిగా తప్పు జరగకుండా తగు నిర్మాణాలను చేసుకొమ్మని కోరుకుంటున్నాను. ఉన్నంతలో పనులు చేసుకుంటూ, ఉన్నత సేవలు అందించాలని ప్రజలు, నాయకులు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఎమ్మెల్యే ఆకాంక్షలకు అనుగుణంగా అందరూ సంతోషంగా ఉండాలి.
నిధుల కోసం సీఎం, కేంద్ర మంత్రులకు ఎమ్మెల్యే వినతి పత్రాలు అందించారు. ఇకపై కొత్తగా ఇళ్లు నిర్మించుకోవాలని అనుకునే వారికి స్నేహపూర్వక సలహా.. కేవలం అప్రూవ్డ్ లేఔట్ లలో కనీస వసతులైన రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యాలు కలిగిన ప్లాట్లు కొనుగోళు చేస్తే సదుపాయాలు లేవని ఎవ్వరినీ అడగవలసిన అవసరం ఉండదు. అలాగే మన ఊరిలో ఎంతో మంది అపర కోటేశ్వరులు ఉన్నారు. వారంతా ఎన్నో చందాలు, విరాళాలు ఇచ్చి ఎన్నో దైవ కార్యాలు, అన్నదానాలు, పండుగలు, వేడుకలు, ఉచిత వివాహాలు ఇంకా ఎన్నో రకాల సేవలాందిస్తున్నారు. వారికి ఇష్టమైతే స్పాన్సర్ చేసి, చందాలు ఇస్తే కూడా రోడ్లు, డ్రైనేజీలు, ఇంకేదైనా అభివృద్ధి చేసుకోగలము. అలాంటి పనులకు దాత పేరుతో కూడిన బోర్డులు ఏర్పాటు చేస్తే వారికి తగు గుర్తింపు లభిస్తుంది. ఈ విషయాన్ని మీడియా ద్వారా ప్రజలందరికి చేరవేయాలని ప్రార్థిస్తున్నాను.