30-01-2026 09:10:50 PM
తప్పు చేస్తే ఉపేక్షించేది లేదు
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలి
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి,(విజయక్రాంతి): నిరంతర పోలీస్ నిఘా మధ్య మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. శుక్రవారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ కేంద్రాల పరిసరాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉందని తెలిపారు. అభ్యర్థులు వారి అనుచరులు ఎన్నికల ప్రవర్తన నియమాలిని ఖచ్చితంగా పాటించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా గుంపులుగా రావడం నినాదాలు చేయడం ర్యాలీలు నిర్వహించడంపై నిషేధం ఉందని తెలిపారు.
శాంతి భద్రతల విఘాతానికి ప్రయత్నించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరి రోజు కావడంతో, కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. నామినేషన్ దాఖలు చివరి రోజు కావడంతో పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. బారికేడ్లు, క్యూ లైన్లు, భద్రతా సిబ్బంది మోహరింపును ఆయన స్వయంగా పరిశీలించి, విధుల్లో ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు.
మున్సిపల్ కార్యాలయం వైపు వచ్చే రహదారులపై ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా వాహనాలను నిర్ణీత పార్కింగ్ ప్రదేశాల్లోనే ఉంచాలని, ప్రధాన కూడళ్ల వద్ద నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. జిల్లాలో స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ ఎస్.హెచ్.ఓ నరహరి, కామారెడ్డి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.