24 May, 2026 | 3:07 AM

సవతి పోరు భరించలేక హత్య

24-05-2026 01:29 AM
  1.   24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు
  2. అక్కన్నపేట మండలం మంచినీళ్లబండలో ఘటన

సిద్దిపేట క్రైం, మే 23(విజయక్రాంతి) : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని మంచినీళ్ల బండ గ్రామంలో మహిళ హత్య కేసును పోలీసులు 24 గంటల వ్యవధిలో ఛేదించారు. పెద్ద భార్య పెత్తనం భరించలేక మనసులో కక్ష పెంచుకున్న చిన్న భార్య ఆమెను హత్య చేసింది. తనపై అనుమానం రాకుండా కేసును పక్కదారి పట్టించేందుకు విఫలయత్నం చేసిన నిందితురాలు చివరికి కటకటాలపాలైంది. పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ శనివారం సిద్దిపేటలో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.

మంచినీళ్ల బండకి చెందిన బోయిని కనకయ్య వ్యవసాయంతోపాటు హమాలీ పని చేస్తుంటాడు. అతనికి ఇద్దరు భార్యలు రాజ్యలక్ష్మి, రాధ. ముగ్గురూ కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. ఈ నెల 21న కనకయ్య రోజూమాదిరిగానే హమాలీ పనికి కట్కూర్ గ్రామానికి వెళ్లాడు. రాత్రి 9 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి పెద్ద భార్య రాజ్యలక్ష్మిని హత్య చేసి, ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడును ఎత్తుకెళ్లినట్లు కనకయ్యకు సమాచారం అందింది.

వెంటనే ఇంటికి చేరుకున్న కనకయ్య రాజ్యలక్ష్మిమృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ అక్కన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాధను విచారించగా, అసలు నిజం బయటపడింది. చీటికిమాటికి తనను అవమానిస్తూ, దూషించేదని గురువారం రాత్రి కూడా గొడవ పెట్టుకున్నదని రాధ చెప్పింది. రాజ్యలక్ష్మి నిద్రిస్తున్న సమయంలో కర్రతో తలపైన మోది హత్య చేసినట్లు అంగీకరించింది.

నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి జిల్లాలో దొంగలు పడుతున్నారనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మృతురాలి మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడును తీసినట్టు తెలిపింది. పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసి నిందితురాలిని పట్టుకున్న పోలీసులను సీపీ రష్మీ పెరుమాళ్ అభినందించారు. చైన్ స్నాచింగ్ కేసులన్నింటినీ పోలీసులు విజయవంతంగా ఛేదించడంపై హర్షం వ్యక్తం చేశారు.