22 August, 2026 | 1:46 AM

తుది దశకు ముసరాంబాగ్ బ్రిడ్జి పనులు

22-08-2026 12:12 AM

మలక్‌పేట్, ఆగస్టు 21  (విజయ్ క్రాంతి): మూసీ నదిపై ముసరాంబాగ్ వద్ద నిర్మిస్తున్న పైవంతెన పనులు తుది దశకు చేరుకున్నాయి. ముసరాంబాగ్ బ్రిడ్జి రెండువైపుల నిర్మాణం కొనసాగుతుండగా ఒకవైపు ప్రారంభించేందుకు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.  ఎంతో కాలంగా వేచి చూస్తున్న పనులు చివరి దశకు చేరుకోవడంతో  ముసరాంబాగ్, పరిసర ప్రాంతాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్ల క్రితం ఇప్పటి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా రూ. 52 కోట్ల వ్యయంతో బ్రిడ్జి పనులకు శ్రీకారం చెప్పారు. ఇదివరకు ఉన్న లో బ్రిడ్జ్ వలన వరద ప్రవాహం పైనుంచి ప్రవహిస్తుండడంతో ఇరువైపుల రాకపోకలకు తీరాటం నెలకొంది.

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ల గేట్లు ఎత్తినప్పుడు నది ప్రవాహం దాటికి వాహిద్ నగర్, తీగలు గూడా, మూసి ఒడ్డు ప్రాంతం వరద నీటిలో చిక్కుకోవడంతో రాకపోకలకు విఘాతం కలిగేది. మలక్పేట్ ఎమ్మెల్యే అహమ్మద్ బలాల, స్థానికుల విన్నపాల మేరకు ప్రభుత్వం మూసీ నదిపై ముసరాంబాగ్ వద్ద పైవంతన నిర్మించేందుకు పనులకు శ్రీకారం చుట్టింది. జిహెచ్‌ఎంసి ప్రాజెక్టు విభాగం ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి. పనులు ప్రారంభమై సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మధ్యలో నత్త నడకన సాగాయి. పెట్టకే లకు ముసారాంబాగ్ బ్రిడ్జి ప్రారంభించేందుకు అధికారులు సమాయతమవుతున్నారు.

గోల్నాక బ్రిడ్జిపై తగ్గనున్న రద్దీ..

ముసరాంబాగ్ వద్ద మూసి నదిపై ఇదివరకు ఉన్న కిందివంతను కూల్చివేయడంతో వాహనాల రాకపోకలను అధికారులు గోల్నాక బ్రిడ్జి వైపు మళ్ళించారు. అంబర్పేట్,  కాచిగూడ, బాగ్ లింగంపల్లి తదితర ప్రాంతాల వైపు వెళ్లేందుకు గోల్నాక బ్రిడ్జి వైపు వాహనాలు అధిక సంఖ్యలో రాకపోకలు కొనసాగించాయి. దీంతో నిత్యం గోల్నా క బ్రిడ్జిపై వాహనాలతో రద్దీ కొనసాగేది.