calender_icon.png 30 September, 2025 | 12:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీ ఉగ్రరూపం!

28-09-2025 12:00:00 AM

హైదరాబాద్ మహా నగరానికి తలమానికమైన మూసీ నది శుక్రవారం ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురిసిన భారీ వర్షాలతో జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండు కుండల్లా మారడంతో గేట్లు తెరవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో నదీ ప్రవాహం మరింత ప్రమాదకరంగా మారి నగరంలోని లోతట్టు ప్రాంతాలను పూర్తిగా ముంచేసింది. చాప కింద నీరులా హఠాత్తుగా వచ్చిన వరదలతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

వర్షాలు ఇలాగే కొనసాగితే మాత్రం మూసీ నదీ ప్రవాహం మరింత ప్రమాదకరంగా మారి నగరాన్ని అతలాకుతలం చేసే అవకాశముందని ఐఎండీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా శుక్రవారం అకస్మాత్తుగా వచ్చిన వరదలు లోతట్టు ప్రాంతాలైన చాదర్‌ఘాట్, ఎంజీబీఎస్, ముసారాంబాగ్, శంకర్ నగర్ ప్రాంతాలను పూర్తిగా ముంచెత్తాయి. దసరా పండుగ నేపథ్యంలో ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఎంజీబీఎస్ బస్టాండ్‌ను వరదలు ముంచెత్తడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. సరిగ్గా 117 ఏళ్ల క్రితం ఇదే రోజున (సెప్టెంబర్ 27, 1908) హైదరాబాద్‌లో మూసీ వరద విలయతాండవం చేసింది. మూసీ వరద ఉదృతికి భాగ్యనగరం చిగురుటాకులా వణికిపోయింది.

అప్పటికే రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు సెప్టెంబర్ 27న ఉదయం 11 గంటలకు మూసీ ఉప్పొంగింది. మూసీ నది రెండు ఒడ్డుల మధ్య దూరం 700 అడుగులే కావడంతో వరద జల విలయం సృష్టించింది. అప్పటి దుర్ఘటనలో 15వేల మందికి పైగా మృతి చెందడం గమనార్హం. తాజాగా మూసీ మరోసారి మహోగ్ర రూపం దాల్చడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. క్లౌడ్ బరస్ట్ విచ్చిన్నంతో మూసీ నది ఎగువన పరీవాహక ప్రాంతాల్లో వారం రోజుల నుంచి కుండపోత వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీనివల్ల ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లోకి మూసీ వరద పోటెత్తింది. నిండుకుండల్లా మారడంతో గేట్లు ఎత్తక తప్పని పరిస్థితి ఏర్పడింది.

దీంతో శుక్రవారం సాయంత్రం నీటిని దిగువకు విడుదల చేయగా.. అప్పటికే నగరంలో వర్షాలు పడుతుండడంతో రోడ్డుపై నిలిచిన నీరుకు వరద నీరు తోడవ్వడంతో లోతట్టు ప్రాంతాలను మూసీ ముంచెత్తింది. మూసీ నది ప్రవహించేది నగరం నడిబొడ్డు నుంచే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అభివృద్ధి పేరుతో మూసీ నది ఒడ్డున విచ్చలవిడి ఆక్రమణలు, కబ్జాలతో భవంతుల నిర్మాణాలు చేపట్టడంతో మూసీ ప్రవహించే ప్రాంతం పూర్తిగా కుంచించుకుపోయింది.

సాఫీగా వెళ్లాల్సిన నీటి ప్రవాహానికి ఆక్రమణలు, కబ్జాలు అడ్డుగోడల్లా నిలబడడంతో వరదలు ఏరులై పారి పురానాపూల్, ముసారాంబాగ్ వంతెనల పైనుంచి ప్రమాదకర స్థాయిలో ప్రవహించడంతో పాటు లోతట్టు ప్రాంతాలను పూర్తిగా నీట మునిగేలా చేసింది. జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ డ్యామ్‌ల చుట్టూరా ఉన్న ప్రాంతాలను పలు రాజకీయ నాయకులు కబ్జాలు చేసి అందులో విచ్చలవిడిగా ఫామ్‌హౌస్‌లు, విల్లాలు నిర్మించారు. దీంతో జలాశయాల నుంచి నీటిని దిగువకు విడుదల చేసే క్రమంలో నీరు సాఫీగా వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతోనే తాజాగా ఆకస్మిక వరదలకు కారణమైందని చెప్పొచ్చు. తమ అవసరాల కోసం ప్రకృతి వనరులను నాశనం చేస్తున్నారు. అందుకే ప్రకృతి ప్రకోపిస్తే ఎలా ఉంటుందో మూసీ వరదలతో మరోసారి స్పష్టమైంది.